1, ఆగస్టు 2014, శుక్రవారం

కార్మికచట్టాలకు సవరణలు

Fri, 1 Aug 2014, IST    vv
శ్రీ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
శ్రీ ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే సభ ముందు
శ్రీ ఆక్షేపించిన కార్మికసంఘాలు
న్యూఢిల్లీ : జాతీయస్థాయిలో కార్మికసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, నరేంద్రమోడీ ప్రభుత్వం పరిశ్రమల యజమానులకు కొమ్ముకాస్తోంది. 'ఓ పేద చారువాలా' ప్రధాని కాకూడదా అని మొసలికన్నీరు కార్చి 'కార్పొరేటు' డబ్బు, ప్రచారపటాటోపంతో గద్దెనెక్కిన ఆయన కార్మిక వ్యతిరేకిని అని ప్రపంచానికి చాట ిచెబుతున్నారు. కార్మికుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా పరిణమించే చట్టసవరణలు తీసుకొ స్తున్నారు. తాజాగా, కేంద్ర మంత్రివర్గం ఫ్యాక్టరీల చట్టం సహా మూడు కార్మిక చట్టాల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మరింత 'ఆచరణీయంగా', కార్మికులకు 'లబ్ధి చేకూరేలా' చట్టాలకు సవరణలు చేస్తున్నామని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. కాగా, ఈ కార్మిక చట్టాల సవరణ ప్రతిపాదనలను ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే సభ ముందు ఉంచుతామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తొమర్‌ గురువారం తెలిపారు. 'కేబినేట్‌ సవరణలకు ఆమోదం తెలిపింది. కార్మికులకు ప్రయోజనాలు చేకూరేలా సవరణలు ఉండబోతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే చట్ట సవరణ ప్రతిపాదనలను సభ ముందుంచాలని మేం భావిస్తున్నాం' అని తొమర్‌ చెప్పారు. అప్రెంటీస్‌ యాక్ట్‌-1961 సహా, కార్మిక చట్టాలు (ఆదాయపన్ను మినహాయింపు, కొన్ని సంస్థల నిర్వహణలకు సంబంధించి రిజిస్టర్ల నిర్వహణ)-1988 చట్టం సవరణల ప్రతిపాదనలను బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదించింది. 1948 ఫ్యాక్టరీల చట్టంలో వర్కింగ్‌ ఉమెన్‌ భద్రత, రాత్రివేళల్లో పని తర్వాత వారికి రవాణ సదుపాయం కల్పించడం నిబంధనలను చేర్చించింది. ఈ చట్టంలో కార్మికుల భద్రత మెరుగుపరచడం, ఓవర్‌టైమ్‌ నిబంధనలను రెట్టింపు చేసింది. కొన్నిచోట్ల మూడు నెలల కాలానికి (త్రైమాసికం) ఓవర్‌టైమ్‌ 50గంటలు ఉండగా దానిని 100గంటలకు పెంచింది. మరికొన్నిచోట్ల ప్రజా ప్రయోజనం ఉన్న ఇతర పనుల్లో 75గంటలనుంచి 125గంటలకు పెంచింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రి విష్ణు దేవ్‌ సాయి కూడా దీనిపై మాట్లాడుతూ ఫ్యాక్టరీల చట్టానికి చేసే సవరణలు ప్రస్తుత పారిశ్రామిక రంగం ముఖచిత్రానికి తగినట్లుగా మరింత ఆచరణీయంగా రూపొందిస్తున్నామని తెలిపారు. ఇదిలాఉంటే, కార్మికసంఘాలు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఆక్షేపించాయి. ఈ చట్ట సవరణ ప్రతిపాదనలు ప్రభుత్వ 'ఏకపక్ష నిర్ణయం' అని ధ్వజమెత్తాయి. వీటి గురించి వార్తాపత్రికల్లో చూసి తెలుసుకున్నాం తప్ప మాకు ఇంతవరకూ ఈ విషయానికి సంబంధించిన ఎటువంటి సమాచారం అందలేదు అని కార్మికసంఘాల నాయకులు వెల్లడించారు.
ఎఐటియుసి కన్నెర్ర-త్వరలో కార్యాచరణ
కేంద్ర మంత్రివర్గం బుధవారం కార్మిక చట్టాలకు సవరణ ప్రతిపాదనలు ఆమోదించడాన్ని ఎఐటియుసి జాతీయ కార్యదర్శివర్గం తీవ్రంగా ఆక్షేపించింది. చిన్న, మధ్యతరహా సంస్థలకు సంబంధించి ఫ్యాక్టరీల చట్టం, అప్రెంటీస్‌ చట్టం, కార్మిక చట్టాల సవరణలను ఆమోదించే ముందు ప్రభుత్వం కేంద్ర కార్మిక సంఘాలను సంప్రదించకపోవడాన్ని కార్యదర్శివర్గం వ్యతిరేకించింది. దీనిపై కార్మికసంఘాలు త్వరలో సమావేశమై, పోరాట కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపింది. ఫ్యాక్టరీల చట్టంలో రాత్రి షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళల ఓవర్‌టైమ్‌ గంటలను 50నుంచి 100కి పెంచడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.చిన్న, మధ్యతరహా సంస్థలలు ఆదాయపన్ను వివరాలు పంపించడం, రిజిస్టర్ల నిర్వహణకు ఎఐటియుసి వ్యతిరేకం కాదన్నారు. అయితే, ఆదాయవివరాలు, రిజిస్టర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేర్చిన సవరణలు పరిశ్రమల యజమానులకు మేలు చేకూరేలా ఉన్నాయని ఎఐటియుసి మండిపడింది. గతంలో 10మంది కార్మికులు ఉంటే రిజిస్టర్‌ నిర్వహించాల్సిన పరిశ్రమలకు నిర్దేశిత పరిధిని 40మంది కార్మికులకు పెంచడం శోచనీయమన్నారు. ఉద్యోగుల నిబంధనలను ఉల్లంఘించే పరిశ్రమల యాజమాన్యాల పర్యవేక్షణను సవరణల్లో చేర్చకపోవడాన్ని ఎఐటియుసి కార్యదర్శివర్గం ఆక్షేపించింది.పారిశ్రామిక వివాదాల చట్టం, కాంట్రాక్ట్‌ లేబర్‌ (క్రమబద్ధీకరణ-రద్దు) చట్టం, కనీసవేతనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూల సవరణలు చేయకపోవడంపై ఎఐటియుసి మండిపడింది. రాజస్థాన్‌ ప్రభుత్వం కాంట్రాక్ట్‌ కార్మికులను నియమించడం, తొలగించే సవరణలను ఎఐటియుసి ఇప్పటికే ఆక్షేపించిన విషయాన్ని గుర్తుచేసింది. పనిచేసే ప్రాంతాల్లో సంస్థలు భద్రతను విస్మరించడం, శాశ్వత ఉద్యోగాల్లో కాంట్రాక్ట్‌ కార్మికులను నియమించి ఇష్టారాజ్యంగా తొలగించడం పట్ల ఎఐటియుసి అభ్యంతరం తెలిపింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి