18, మే 2012, శుక్రవారం

న్యూఢిల్లీ, మే 15: ఈ ఆర్థిక సంవత్సరంలో ఇరాన్ నుంచి చేసుకుంటున్న ముడిచమురు దిగుమతులను 11.1 శాతం తగ్గించాలని భారత్ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉన్న చమురు అవసరాల దృష్ట్యా ఈసారి 15.5 మిలియన్ టన్నుల మేర ముడిచమురును ఇరాన్ నుంచి దిగుమతి చేసుకోవాలని భారత్ నిర్దేశించుకుంది.
ఈ మేరకు పార్లమెంట్‌లో పెట్రోలియం, సహజవాయువు శాఖ సహాయమంత్రి ఆర్‌పిఎన్ సింగ్ రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. 2010-11లో భారతీయ సంస్థ లు 18.50 మిలియన్ టన్నుల ముడిచమురును, 2011-12లో 17.44 మిలియన్ టన్నుల ముడిచమురును దిగమతి చేసుకున్నట్లు మంత్రి స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుత 2012-13లో 15.5 మిలియన్ టన్నులను దిగుమతి చేసుకోవాలనుకున్నామని, అయితే ఇప్పుడు అందులో 11.1 శాతం దిగుమతులను తగ్గించుకోవాలని నిర్ణయించామన్నారు.
కాగా, ఇరాన్ సాగిస్తున్న అణు కార్యకాలాపాల దృష్ట్యా ఆ దేశంపై అమెరికా విధించిన ఆంక్షల నేపథ్యంలో భారత్ ముడిచమురు దిగుమతులను తగ్గించుకోవడం గమనార్హం. ప్రస్తుతం ముడిచమురు అవసరాలను భారత్ ఇరాన్ నుంచే అధికంగా తీర్చుకుంటున్న విషయం తెలిసిందే.

ఇరాన్ (పురాతన నామం = పర్షియా) (పర్షియన్: ایران) నైఋతి ఆసియాలోని ఒక మధ్యప్రాచ్య దేశము. 1935 దాకా ఈ దేశము పాశ్చాత్య ప్రపంచములో పర్షియా అని పిలవబడేది.1959లో మహమ్మద్ రెజా షా పహ్లవి ఉభయ పదములు ఉపయోగించవచ్చని ప్రకటించారు.కానీ ప్రస్తుత ఇరాన్ ను ఉద్దేశించి "పర్షియా" పదము వాడుక చాలా అరుదు. ఇరాన్ అను పేరు స్థలి "ఆర్యన్" అర్థం "ఆర్య భూమి".
ఇరాన్ కు వాయువ్యాన అజర్‌బైజాన్ (500 కి.మీ) మరియు ఆర్మేనియా (35 కి.మీ), ఉత్తరాన కాస్పియన్ సముద్రము, ఈశాన్యాన తుర్కమేనిస్తాన్ (1000 కి.మీ), తూర్పున పాకిస్తాన్ (909 కి.మీ) మరియు ఆఫ్ఘనిస్తాన్ (936 కి.మీ), పశ్చిమాన టర్కీ (500 కి.మీ) మరియు ఇరాక్ (1458 కి.మీ), దక్షిణాన పర్షియన్ గల్ఫ్ మరియు ఒమాన్ గల్ఫ్ లతో సరిహద్దు కలదు. 1979లో, అయాతొల్లా ఖొమేని ఆధ్వర్యములో జరిగిన ఇస్లామిక్ విప్లవం పర్యవసానముగా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ (جمهوری اسلامی ایران) గా అవతరించినది.

చరిత్ర

ఇరాన్ యొక్క జాతీయత పర్షియా నుండి ఉద్భవించినది. పర్షియా అన్నపదము నేటి ఇరాన్, తజికిస్తాన్, టర్కీ, ఆఫ్ఘానిస్తాన్, కాకసస్ ప్రాంతాలకు ఉన్న ప్రాచీన గ్రీకు పేరు పర్సిస్ నుండి వచ్చినది. క్రీ.పూ 6వ శతాబ్దములో ఈ ప్రాంతాలన్నీ ఆకెమెనిడ్ వంశము యొక్క పాలనలో గ్రీస్ నుండి వాయువ్య భారతదేశము వరకు విస్తరించిన మహాసామ్రాజ్యములో భాగముగా ఉన్నవి. అలెగ్జాండర్ మూడు ప్రయత్నాల తర్వాత ఈ సామ్రాజ్యాన్ని జయించగలిగాడు. అయితే పర్షియా వెనువెంటనే పార్థియన్ మరియు సస్సనిద్ సామ్రాజ్యాల రూపములో స్వతంత్ర్యమైనది. అయితే ఈ మహా సామ్రాజ్యాలను 7వ శతాబ్దములో ఇస్లాం అరబ్బీ సేనల చేత చిక్కినచి. ఆ తరువాత సెల్జుక్ తుర్కులు, మంగోలులు మరియు తైమర్‌లేను ఈ ప్రాంతాన్ని జయించారు.
16వ శతాబ్దములో సఫవిదులు పాలనలో తిరిగి స్వాతంత్ర్యమును పొందినది. ఆ తరువాత కాలములో ఇరాన్ను షాహ్ లు పరిపాలించారు. 19వ శతాబ్దంలో పర్షియా, రష్యా మరియు యునైటెడ్ కింగ్ డం నుండి వత్తిడి ఎదుర్కొన్నది. ఈ దశలో దేశ ఆధునీకరణ ప్రారంభమై 20వ శతాబ్దములోకి కొనసాగినది. మార్పు కోసము పరితపించిన ఇరాన్ ప్రజల భావాల అనుగుణంగా 1905/1911 పర్షియన్ రాజ్యాంగ విప్లవం జరిగినది.

సంస్కృతి



ఫర్హంగ్ ("సంస్కృతి") అన్నివేళల పర్షియన్ నాగరికత కేంద్ర బిందువు.
ఇరానీ సంస్కృతి ప్రపంచం లోని ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి.అసలు 'ఇరాన్' అనే పదం 'ఆయిర్యాన' అను పదం నుండి ఉధ్భవంచింది.ఇరానీయుల సంప్రాదాయల కు,భారతీయ సంప్రదాయలకు దగ్గరి పోలిక ఉంది.వారు అగ్ని ఉపాసకులు.వారు కూడ ఉపనయనాన్ని పోలిన ఒక ఆచారాన్ని పాటిస్తారు.దీనిని బట్టి వారి పూర్వికులు కూడా ఆర్యులే నని పలువురు చరిత్రకారుల అభిప్రాయం.
అన్నీ ప్రాచీన నాగరికతల వలెనే, పర్షియన్ నాగరికతకు కూడా సంస్కృతే కేంద్ర బిందువు. ఈ నేల యొక్క కళ, సంగీతం, శిల్పం, కవిత్వం, తత్వం, సాంప్రదాయం మరియు ఆదర్శాలే ప్రపంచ విఫణీలో ఇరానియన్లకు గర్వకారణము. ఇరానీ ప్రజలు తమ నాగరికత ఆటుపోట్లను తట్టుకొని వేల సంవత్సరాల పాటు మనుగడ సాగించడానికి దాని యొక్క సాంస్కృతే ఏకైక ప్రధాన కారణమని భావిస్తారు.

ఇరాన్ కేబినెట్‌లో మహిళలు

  • దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఇరాన్ కేబినెట్‌లో మహిళలకు చోటు లభించింది. దేశాధ్యక్షుడిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అహ్మదీ నెజాద్ కేబినెట్‌లో గైనకాలజిస్టు మర్‌జిహే వహిద్ దస్త్‌జెర్ది(50), శాసనకర్త ఫాతిమే అజోర్లు(40) మహిళలు.1970ల తర్వాత ఇరాన్ కేబినెట్‌లో స్త్రీలకు చోటు దక్కడం ఇదే ప్రథమం. 1968-77 మధ్య ఫరోఖ్రో పార్సే చివరి మహిళా మంత్రిగా పనిచేశారు. 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం అవినీతి ఆరోపణలపై ఆమెను పాలకులు ఉరితీశారు.ఈనాడు 17.8.2009

ఇరాన్ ఆయిల్ కొనుగోలు పెంచిన టర్కీ

Iranian oil tankerఇరాన్ నుండి కొనుగోలు చేస్తున్న క్రూడాయిల్ మొత్తాన్ని టర్కీ అధికం చేసింది. ఇరాన్ తయారు చేయని అణు బాంబు ప్రపంచ శాంతికి ప్రమాదం అని చెబుతూ ఆదేశానికి వ్యతిరేకంగా వాణిజ్య ఆంక్షలు విధిస్తూ చట్టం చేసి తమ చట్టాన్ని అమలు చేయాలని ప్రపంచ దేశాలపై ఒత్తిడి చేస్తున్న అమెరికాకి టర్కీ ఈ విధంగా సమాధానం చెప్పింది.
ఫిబ్రవరి తో పోలిస్తే మార్చి నెలలో ఇరాన్ నుండి టర్కీ దిగుమతి చేసుకున్న క్రూడాయిల్ దాదాపు మూడు రెట్లు పెరిగిందని ప్రెస్ టి.వి తెలిపింది. మార్చి నెలలో రోజుకి 2,70,000 బ్యారెళ్ళ ఇరాన్ క్రూడాయిల్ ని టర్కీ దిగుమతి చేస్తుకుంది. ఫిబ్రవరి నెలలో ఇది రోజుకి 1,00,000 బ్యారెళ్లు (401,349 టన్నులు) మాత్రమే.
టర్కిష్ స్టాటిస్టికల్ ఇన్స్టిటూట్ వెబ్ సైట్ అందించిన గణాంకాలను ప్రెస్ టి.వి ఉటంకించింది. గత సంవత్సరం జులై తర్వాత ఈ మార్చిలో అత్యధిక క్రూడాయిల్ ను ఇరాన్ నుండి టర్కీ దిగుమతి చేసుకుందని ఈ వెబ్ సైట్ ద్వారా తెలుస్తోంది. గత సంవత్సరం మార్చి నెలతో పోల్చుకున్నప్పటికీ ఇరాన్ ఆయిల్ దిగుమతులను 90 శాతం మేరకు టర్కీ అధికం చేసింది.
2012 లో మొదటి మూడు నెలల్లో టర్కీ దిగుమతి చేసుకున్న మొత్తం క్రూడాయిల్ లో సగానికి పైగా ఇరాన్ నుండి దిగుమతి చేసుకున్నదే. ఈ మూడు నెలల్లో టర్కీ రోజుకి 3,50,000 బ్యారెళ్ళ క్రూడ్ దిగుమతి చేసుకోగా అందులో 1,93,000 బ్యారెళ్లు ఇరాన్ నుండి దిగుమతి చేసుకుంది. ఇరాన్ పై విధించిన ఆంక్షల నుండి టర్కీకి మినహాయింపు ఇవ్వాలని టర్కీ కోరుతోంది.
10 యూరోప్ దేశాలను ఇరాన్ పై విధించిన ఆంక్షల నుండి మినహాయిస్తున్నట్లు మార్చి 20 న అమెరికా ప్రకటించింది. ఈ దేశాలలో టర్కీ లేదు. టర్కీ తో పాటు ఇండియా, దక్షిణ కొరియా లాంటి మిత్ర దేశాలను ఆంక్షల నుండి మినహాయించడానికి అమెరికా అంగీకరించలేదు. ఆంక్షలు అమలు చేయాలని ఒత్తిడి చేయడానికి అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆది, సోమ వారాల్లో చైనా, ఇండియాలు పర్యటించి వెళ్లింది.
ఇరాన్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవడం అంటే పశ్చిమాసియా లో నివశిస్తున్న అరవై లక్షల భారతీయుల భద్రతకు ప్రమాదమని, చూడాలనీ నసుగుతున్న ఇండియా టర్కీ ని ఉదాహరణగా తీసుకోవలసి ఉంది. ఇరాన్ క్రూడ్ దిగుమతులు తగ్గించుకోవడం సాధ్యం కాదని ఇండియా పైకి చెబుతున్నప్పటికీ వాస్తవంలో క్రమంగా తగ్గించుకుంటోంది. అమెరికాకి కోపం రాకుండా ఉండడానికి తంటాలు పడుతోంది. అందుకోసం తన వాణిజ్య ప్రయోజనాలతో పాటు ప్రజల ప్రయోజనాలనూ ఫణంగా పెడుతోంది. 

భారత ప్రజల ఆయిల్ ప్రయోజనాలు దెబ్బ తీయనున్న క్లింటన్ పర్యటన

iran-indiaఆది, సోమ వారాల్లో ఇండియా పర్యటించనున్న అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ భారత ప్రజల ఇంధన ప్రయోజనాలను గట్టి దెబ్బ తీయనుంది. తన పర్యటన సందర్భంగా ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు మరింత తగ్గించుకోవాలని హిల్లరీ భారత ప్రభుత్వంపై ఒత్తిడి చేయనుందని క్లింటన్ సహాయకులు చెప్పారు. అమెరికా ఒత్తిడితో ఇరాన్ గ్యాస్ పైప్ లైన్ ఒప్పందాన్ని రద్దు చేస్తుకున్న భారత ప్రభుత్వం అమెరికా మంత్రి ఒత్తిడికి లోగిపోదన్న గ్యారంటీ లేదు. ప్రపంచ ఆయిల్ ధరలతో పోలిస్తే మేలైన ఇంధనాన్ని చౌకగా సరఫరా చేసే ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులను తగ్గించుకున్నట్లయితే భారత ప్రజలకు పెట్రోల్, డీజెల్ ధరలు మరింత పెరగడం ఖాయం.
అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్ ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పర్యటిస్తోంది. ఆదివారం సాయంత్రానికల్లా ఆమె కోల్ కతా రానున్నది. అనంతరం ఆమె కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపనుంది. క్లింటన్ పర్యటన ఉద్దేశ్యాలను ఆమెతో ఉన్న సహాయకులు తెలియజేశారని ‘ది హిందూ’ పత్రిక తెలిపింది. కోల్ కతా, న్యూఢిల్లీలలో క్లింటన్ ప్రవేటు చర్చలు జరపనున్నట్లుగా సదరు సహాయకులు తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వంతో, భారత కేంద్ర ప్రభుత్వంతో అమెరికా విదేశాంగ మంత్రి ‘ప్రవేటు చర్చలు’ జరపడమే అభ్యంతరకరం కాగా దేశ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా దేశ ఆయిల్ దిగుమతులను ప్రభావితం చేయాలని చూడడం మరో ఘోరం.
“ధోరణి అనుకూలంగా ఉన్నా, మరింత ప్రగతి సాధిస్తామని వారు గట్టి హామీలు ఇవ్వాల్సి ఉంది” అని క్లింటన్ సహాయకుడిని ఉటంకిస్తూ ‘ది హిందూ’ తెలిపింది. గత కొద్ది కాలంగా సౌదీ అరేబియా నుండి ఆయిల్ దిగుమతులు పెంచుకుని ఇరాన్ ఆయిల్ దిగుమతుల లోటును పూడ్చుకోవడానికి భారత దేశం ప్రయత్నాలు ముమ్మరం చేసిందనీ, మరిన్ని ప్రత్యామ్నాయాలు ఇండియా వెతుక్కోవలసి ఉందనీ సదరు క్లింటన్ సహాయకుడు అన్నాడు.
జనవరి 1 న తాను ప్రకటించిన ఆంక్షలనుండి తప్పించుకోవాలంటే జూన్ లోగా ఇరాన్ నుండి ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవాలని అమెరికా షరతు విధించింది. ఇరాన్ అణు బాంబును తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నదంటూ ఆ దేశంపై నాలుగు సార్లు ఐక్య రాజ్య సమితి భద్రతా సమితి ఆంక్షలు విధించేలా అమెరికా, యూరప్ లు ఒత్తిడి చేశాయి. అవి కాకుండా స్వయంగా ఇరాన్ పై అనేక అంతర్జాతీయ ఆంక్షలు విధిస్తూ అమెరికా కాంగ్రెస్ చట్టాలు చేసింది. అమెరికా కాంగ్రెస్ చేసిన చట్టాలను అమలు చేయాలని భారత దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది.
ఇరాన్ పైన అమెరికా, యూరప్ లు విధిస్తున్న ఆంక్షలు పూర్తిగా ఆ దేశాల కంపెనీల ప్రయోజనాలు సంబంధించినవి. ఇరాన్ ఆయిల్ తవ్వుకుని లాభాలు పొందడానికి అమెరికా కంపెనీలకు ఇరాన్ అనుమతి ఇవ్వడం లేదు. 1979 లో అమెరికా అనుకూల షా ప్రభుత్వాన్ని ఇరాన్ ‘ఇస్లామిక్ విప్లవం’ కూల్చి వేసింది. విప్లవం తర్వాత అమెరికా ఆయిల్ కంపెనీలను ఇరాన్ నుండి తరిమి వేశారు. అప్పటి నుండీ ఇరాన్ ప్రభుత్వాన్ని లొంగదీసుకోవడానికి అమెరికా, యూరప్ లు ప్రయత్నిస్తున్నాయి. దానికి ఇరాన్ అణు విధానం వాటికి అనువుగా దొరికీంది.
ఇరాన్ అణు బాంబు ప్రపంచ భద్రత కి ప్రమాదం అంటూ అమెరికా, యూరప్ లు ప్రచారం లంకించుకున్నాయి. వేల కొద్దీ విధ్వంసక అణ్వాయుధాలను పోగేసుకున్న అమెరికా, యూరప్ దేశాలు తమ అణ్వాయుధాల వల్ల లేని ప్రమాదం అసలే లేని ఇరాన్ అణు బాంబు వల్ల ఉన్నదని చెప్పడం పెద్ద మోసం. అసలు వాస్తవం అది కాదు. తమ కంపెనీల ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం అమెరికా, యూరప్ లు అనేక బ్లాక్ మెయిలింగ్ ఎత్తుగడలు అమలు చేస్తాయి. మానవ హక్కులు, బాల కార్మికులు, మహిళా హక్కులు, అణ్వాయుధాలు, ప్రజాస్వామ్యం, నియంతృత్వం లాంటి అంశాలను బ్లాక్ మెయిలింగ్ కోసం అవి వినియోగిస్తాయి. ఇరాన్ కి సంబంధించి అణు విధానాన్ని అమెరికా ఎంచుకుని అమలు చేస్తోంది.
నిజానికి పశ్చిమాసియాలోనే ఉన్న ఇజ్రాయెల్ వద్ద 200 నుండి 300 వరకూ అణ్వాయుధాలున్నాయని అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఒకసారి వెల్లడించాడు. పాలస్తీనా ప్రజలపై దురాక్రమణ జాత్యహంకార విధానాలను అమలు చేస్తున్న ఇజ్రాయెల్, తమ ఉనికికి భంగం కలిగిస్తే తమ అణ్వాయుధాలతో ప్రపంచం మొత్తాన్ని భస్మీ పటలం చేస్తామని హెచ్చరికలు కూడా జారీ చేసింది. అలాంటి ఇజ్రాయెల్ ని అమెరికా, యూరప్ లు వెనకేసుకొస్తూ అసలు అణ్వాయుధమే లేని ఇరాన్ పైన ఆంక్షలు విధిస్తున్నాయి. ఇరాన్ తోటి అమెరికా, యూరప్ లు జరిపే చర్చలు కూడా ఇరాన్ ఆయిల్ చుట్టూనే తిరుగుతాయి. అమెరికా, యూరప్ దేశాలకి చెందిన బహుళ జాతి ఆయిల్ కంపెనీలకు ఇరాన్ లో ప్రవేశం కల్పించినట్లయితే ఆంక్షలు ఎత్తివేయడానికి సిద్ధపడతాయి.
తమ ఆయిల్ కంపెనీల సమస్యని అమెరికా, యూరప్ లు ప్రపంచంపైన రుద్దు తున్నాయి. మా ఆయిల్ మాదే అంటున్న ఇరాన్ దేశ ఆయిల్ దిగుమతి చేసుకోవద్దని భారత దేశం లాంటి దేశాలపైన ఒత్తిడి తెస్తున్నాయి. భారత దేశ ఖనిజ వనరులను విదేశీ ప్రవేటు కంపెనీలకు నిరభ్యంతరంగా అప్పజెపుతున్న భారత పాలకులు అమెరికా ఆంక్షలు అమలు చేయడానికి నిరాకరిస్తారని ఆశించలేము. ఇరాన్ దిగుమతులు తగ్గించుకునేది లేదని ఆయిల్ మంత్రి జైపాల్ రెడ్డి పైకి ఎన్ని చెప్పినా అధికారులకి మాత్రం ఇరాన్ దిగుమతులు తగ్గించుకోవాలని ఆదేశాలిచ్చాడు. ఈ ప్రక్రియని వేగవంతం చేయాలని క్లింటన్ ఒత్తిడి చేయనుంది. 
అంతర్జాతీయ రాజకీయాల వల్ల ఇరాన్ చౌక ధరలకి ఆయిల్ ని మన దేశానికి అందిస్తోంది. అమెరికా ఒత్తిడి వల్ల ఇరాన్ బదులుగా సౌదీ అరేబియా ఆయిల్ ని ఇండియా  దిగుమతి చేసుకోవలసి ఉంటుంది.  కానీ సౌదీ ఆయిల్ ఖరీదు ఎక్కువ. దాని కంటే ఇరాన్ ఆయిల్ మేలు రకం. సీసం పాళ్ళు ఇరాన్ ఆయిల్ లో తక్కువ. అందువల్ల  సౌదీ ఆయిల్ కంటే ఇరాన్ ఆయిల్ వల్ల కాలుష్యం తక్కువగా వెలువడుతుంది. అదీ కాక ఇరాన్ ఆయిల్ రంగంలో ఇండియా గణనీయంగా పెట్టుబడులు పెట్టింది. కనుక ఇరాన్ ఆయిల్ తగ్గించుకుంటే అది నేరుగా ఇండియా పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇరాన్ ఆయిల్ కి ఇండియా డాలర్లు చెల్లించనవసరం లేదు. రూపాయిలు చెల్లిస్తే సరిపోతుంది. ఆ రూపాయిలతో ఇరాన్ మళ్లీ ఇండియా సరుకులు కొనుగోలు చేస్తుంది. కనుక ఇరాన్ ఆయిల్ తగ్గించుకుంటె భారత దేశ విదేశీ వాణిజ్య బిల్లు పెరిగి మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతాయి. అంతే కాక వాణిజ్య లోటు మరింత పెరిగి ఫిస్కల్ డెఫిసిట్ పెరగడానికి దారి తీస్తుంది. ఈ విధంగా  మన వేలితో మన కన్నే పొడుచుకునేలా అమెరికా ఒత్తిడి తెసోదన్న మాట. ఒక్క 2011 లోనే అమెరికా ఒత్తిడి వల్ల ఇరాన్ తో 12 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఇండియా తగ్గించుకుందని పై గ్రాఫ్ ద్వారా అర్ధం అవుతోంది. 
సౌదీ అరేబియా ఆయిల్ ని అధిక ధరలకి కొనడం అంటే అక్కడ ఉన్న పశ్చిమ దేశాల ఆయిల్ కంపెనీల లాభాలు పెంచడమే. ఇప్పటికే సౌదీ అరేబియా ఆయిల్ ని భారత దేశం అధికంగా దిగుమతి చేసుకుంటోంది. దానిని మరింత పెంచడం అంటె దేసంలో మరింత కాలుష్యం పెంచుకోవడంతో పాటు మరింత విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేసుకోవడమే. తమ కంపెనీల లాభాలు పెంచడమే అమెరికా విదేశాంగ విధానాల మౌలిక లక్ష్యం.
భారత దేశ పార్లమెంటు ఇరాన్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకోవడానికి నిరాకరిస్తున్నట్లు అమెరికా అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకే పార్టీకి మంద బలంతో కూడిన మెజారిటీ అందిస్తే ఇలాంటి విషయాల్లో పార్లమెంటుతో సంప్రదించకుండా ప్రభుత్వాలు చర్యలు అమలు చేస్తాయి. చిన్నదే అయినప్పటికీ కూటమి ప్రభుత్వాల వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయని ఈ సందర్భంగా అర్ధం చేసుకోవచ్చు.
ఇరాన్ ఆయిల్ దిగుమతులను తగ్గించుకోవడంతో పాటు సంస్కరణలను వేగవంతం చేయడానికి కూడా క్లింటన్ ఒత్తిడి చేయనున్నదని తెలుస్తోంది. ద్రవ్య రంగంలో (బ్యాంకింగ్, ఇన్సూరెన్స్) విదేశీ పెట్టుబడులపై నిబంధనలు ఎత్తివేయడం, రిటైల్ రంగంలో విదేశీ కంపెనీల అనుమతి లాంటి నిర్ణయాలు చేయాలని క్లింటన్ కోరనుంది. సంస్కరణలు వేగవంతం చేయడం అంటే విదేశీ కంపెనీలకే ప్రయోజనం తప్ప భారత ప్రజలకు కాదని దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. 

ఇండియా, ఇరాన్ నుండి చేసుకుంటున్న ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకోవాల్సిందేనని అమెరికా విదేశీ మంత్రి హిల్లరీ క్లింటన్ హుకుం జారీ చేసింది. ఇరాన్ దిగుమతులను ఇప్పటికే గణనీయంగా తగ్గించుకున్నందుకు హర్షం వ్యక్తం చేసిన హిల్లరీ, అది చాలదనీ, ఇంకా తగ్గించుకోవాలని కోరింది. ‘ఇరాన్ ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకునేది లేదని’ జనవరిలో పెట్రోలియం మంత్రి జైపాల్ రెడ్డి చేసిన ప్రకటన ఒట్టిదేనని హిల్లరీ హర్షం స్పష్టం చేసింది. ఆ రకంగా బహిరంగంగానే ఇండియాకి ఆదేశాలిస్తున్న హిల్లరీని ‘అదేమని’ ప్రశ్నించిన భారతీయ విలేఖరులే లేకపోవడం విచారకరం.
ఇరాన్ ఆయిల్, గ్యాస్ దిగుమతులను తగ్గించుకునే విషయంలో భారత్ “ఇంకా చేయాల్సింది చాలా ఉంది” అని హిల్లరీ వ్యాఖ్యానించింది. ఇరాన్ అణు కార్యక్రమం ‘శాంతియుత ప్రయోజనాలకే’ అని రుజువు చేసుకోవాలంటే ఆ దేశంపై మరిన్ని ఆంక్షలతో ఒత్తిడి పెంచక తప్పదని ఆమె వ్యాఖ్యానించింది. ఇండియా ఆయిల్ ఉత్పత్తి చేసుకునే దేశం కాకపోయినప్పటికీ ఇరాన్ దిగుమతులను ఇండియా ఎందుకు తగ్గించుకోవాలంటున్నదని విలేఖరులు అడిగిన ప్రశ్నకు హిల్లరీ ఈ సమాధానం ఇచ్చింది. ఇరాన్ ఆయిల్ దిగుమతులు తగ్గించుకునేలా ఒత్తిడి చేయడమే హిల్లరీ పర్యటనకు ప్రధాన లక్ష్యమని ‘ది హిందూ’ తెలిపింది.
ఇరాన్ అణు విధానం పశ్చిమాసియాలో అస్ధిరతకు కారణమని హిల్లరీ అన్నది. ఇరాన్ అణు బాంబు ప్రపంచానికి ‘వినాశకరం’ అని ఆమె వ్యాఖ్యానించింది. ఇరాన్ తన ప్రవర్తన మార్చుకోవాలని అంతర్జాతీయ సమాజం కోరుతోందనీ అందుకే ఆ దేశంపై ఒత్తిడి పెంచాలనీ హిల్లరీ అన్నది. ఇరాన్ విషయంలో ఇండియా చేయగలదేమిటని ప్రశ్నించగా హిల్లరీ అహంభావ పూరితంగా సమాధానం ఇచ్చింది. “ఇండియా అంతదూరం తీసుకెళితే మేము ఆమోదించం. వాళ్ళు ఇంకా చేస్తారని మేము ఆశిస్తున్నాం. సౌదీ అరేబియా, ఇరాన్ ల నుండి సరిపోయినంత ఆయిల్ సరఫరా ఉందని నమ్ముతున్నాం. అంతర్జాతీయ సమాజంలో ఇది ఇండియా పోషించవలసిన పాత్ర అని భావిస్తున్నాం” అని హిల్లరీ అన్నది.
జూన్ నెల లోపు అమెరికా ఆదేశించిన మొత్తంలో ఇరాన్ నుండి ఆయిల్, గ్యాస్ దిగుమతులు తగ్గించాలని హిల్లరీ డిమాండ్ చేస్తున్నది. అమెరికా చట్టం ప్రకారం కనీసం 15 శాతం మేరకు దిగుమతులు తగ్గించుకోవాలని గతంలో ‘డెయిలీ మెయిల్’ పత్రిక తెలియజేసింది. రోజుకు 4.25 లక్షల బ్యారేళ్ళ ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న ఇండియా అమెరికా షరతు ఆమోదిస్తే దానిని 3,61,000 బ్యారేళ్ళకు తగ్గించుకోవాలన్నమాట. రోజుకి 63,750 బ్యారేళ్లు దిగుమతి తగ్గించుకోవడం అంటే అది ఇండియా ఆయిల్ బిల్లుని అమాంతం పెంచేస్తుంది.
ఇరాన్ ఆయిల్ కోసం ఇండియా చేసే చెల్లింపుల్లో 45 శాతం రూపాయిల్లో చెల్లించే ఒప్పందం ఇండియా, ఇరాన్ లు చేసుకున్నాయి. ఆ రూపాయిలతో ఇరాన్ మళ్ళీ ఇండియా సరుకులు కొంటుంది. అంటే ఇరాన్ కి చెల్లించే ఆయిల్ డబ్బుల్లో 45 శాతం మనకి తిరిగి వస్తాయన్నమాట. ఇంతకంటే ఆకర్షణీయమైన వాణిజ్య ఒప్పందం మరొకటి ఉండబోదు. అంతర్జాతీయ వాణిజ్యంలో అనధికారిక విదేశీ మారక ద్రవ్యం అయిన డాలర్లకు ఎక్కువ విలువ ఉంటుంది. అలాంటి డాలర్లకు బదులు రూపాయిలు చెల్లించే సువర్ణావకాశం ఇరాన్ ఇండియాకి కల్పిస్తోంది. పైగా వాటితో ఇండియా సరుకులు కొంటోంది. ఈ అవకాశాన్ని రద్దు చేసుకోవాలని హిల్లరీ ఇండియాని దబాయిస్తోంది.
ఇరాన్ ఆయిల్ తగ్గించుకుంటే ఆ మేరకు ఇండియా సరుకుల్ని ఇరాన్ కొనుగోలు చేయదు. అంటే మన ఎగుమతులు తగ్గిపోతాయి. ఎగుమతులు తగ్గిపోవడమే కాక అధిక ధర పెట్టి సౌదీ ఆయిల్ కొంటే దిగుమతుల విలువ కూడా పెరుగుతుంది. అంటే రెండు వైపులా (ఎగుమతులు పెరగడం, దిగుమతులు తగ్గడం) ఇండియా వాణిజ్య లోటు పెరుగుతుందన్న మాట. వాణిజ్య లోటు పెరగడం అంటే ఇండియా విదేశీమారక ద్రవ్య నిల్వలు తగ్గిపోవడమే. ఇండియా లాంటి దేశాలు చచ్చీ చెడీ విదేశీ మారక ద్రవ్య నిల్వలని కూడబెడుతూ ఉంటాయి. అలాంటి నిల్వలను వాణిజ్య లోటు హారతి కర్పూరంలో హరించేస్తాయి.
సౌదీ ఆయిల్ కొనాలని హిల్లరీ చెప్పడం అంటే సౌదీలో తమ కంపెనీలు ఉత్పత్తి చేసే ఆయిల్ కొనాలని పరోక్షకంగా చెప్పడమే. అమెరికా ఆంక్షలు ఇరాన్ అణు విధానం కి సంబంధించినవి కావని, దాని కంపెనీల సరుకులు అమ్ముకోవడమే ఆంక్షల ప్రధాన లక్ష్యమని దీన్ని బట్టి స్పష్టం అవుతోంది. అణు బాంబులే లక్ష్యం అయితే ఇరాన్ కి అణు బాంబులు నిర్మించే సామర్ధ్యం లేదని అమెరికా గూఢచారి వర్గాలు తేల్చేసాయి. ఇరాన్ అణు బాంబు నిర్మించడం లేదని ఇజ్రాయెల్ గూఢచార వర్గాలతో పాటు ఆ దేశ అత్యున్నత సైనికాధికారి కూడా ఇటీవల ధ్రువపరిచాడు. ఇక లేని ఇరాన్ అణు బాంబు కోసం ఇండియా ఆయిల్ దిగుమతులు తగ్గించుకుని తన వాణిజ్య లోటుని ఎందుకు పెంచుకోవాలి?
అదీ కాక దేశ రక్షణ కోసం ఒక్క అణుబాంబులే కాదు, ఏ బాంబులయినా తయారు చేసుకునే హక్కు ప్రతి దేశానికీ ఉంటుంది. అణు గూండాయిజానికి బలవుతోంది ఒక్క ఇరాన్ మాత్రమే కాదు. ఇండియా కూడా గత నలభై యేళ్లుగా అమెరికా, యూరప్ దేశాల అను గూండాయిజాన్ని ఎదుర్కొంటోంది. ఇందిరా గాంధీ నేతృత్వంలో అణు పరీక్ష జరిపాక భారత దేశానికి ఏ దేశమూ అణు ఇంధనం గానీ, అణు రియాక్టర్లు గానీ, ఇతర అణు పరికరాలు గానీ అమ్మకుండా అమెరికా, యూరప్ లు ఆంక్షలు విధించాయి. దాని వల్ల ఇండియా తానే అణు టెక్నాలజీని అభివృద్ధి చేసుకుని అమెరికా, యూరప్ ల ఆంక్షలు సోదిలోకి కూడా రావని చాటి చెప్పింది. నాలుగు దశాబ్దాల పాటు అణు గూండాయిజం ఎదుర్కొన్న ఇండియా మరో బాధితురాలు ఇరాన్ కి తోడు నిలవాలసిన కనీస బాధ్యత ఉంటుంది. కానీ భారత పాలకులు ఇది కూడా ఆలోచించే స్ధితిలో లేరని హిల్లరీ సర్టిఫికేట్ బట్టి అర్ధం అవుతోంది.
అమెరికా, యూరప్ ల ఒత్తిడి తోటి భద్రతా సమితి నాలుగు సార్లు ఇరాన్ పైన ఆంక్షలు విధించాయి. అవి కాక అమెరికా, యూరప్ దేశాల ప్రభుత్వాలు స్వయంగా కొన్ని చట్టాలు చేసి వారి చట్టాలు అమలు చేయాలని ఇండియా పైన ఒత్తిడి తెస్తున్నాయి. స్వతంత్ర దేశాల పైన ఆంక్షలు విధించడం సరికాదన్నది ఇండియా విదేశాంగ విధానం. కనీసం తన విధానాన్ని అమలు చేసినా అమెరికా ఆంక్షలను ఇండియా గట్టిగా తిరస్కరించాలి. అలీనోద్యమం ద్వారా ఇండియా సాధించుకున్న పరువు ప్రతిష్టలు ప్రస్తుత పాలకులు ఆంక్షలకు లొంగడం ద్వారా మసకబారుస్తున్నారు. ఈ విధానాన్ని భారత పాలకులు విడిచి పెట్టి భారత దేశం స్వతంత్ర దేశమనీ, పెత్తందారీ దేశాల పెట్టణాన్ని అంగీకరించేది లేదనీ చాటి చెప్పాల్సిన అవసరం ఉంది.