21, జనవరి 2015, బుధవారం

మహిళా ఉద్యోగి తొలగింపు ఉత్తర్వు రద్దు
Posted on: Wed 21  2015

- కోర్టు జోక్యంతో దిగివచ్చిన టాటా
    చెన్నై: నిబంధనలకు విరుద్ధంగా టాటా కన్సల్టెన్సీ కంపెనీ తనని ఉద్యోగం నుండి తొలగించడంపై ఒక మహిళా ఉద్యోగి కోర్టుకెక్కారు. దాంతో ఆ కంపెనీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మహిళకు ఇచ్చిన ఉద్యోగ తొలగింపు ఉత్తర్వులను రద్దు చేసినట్టుగా కంపెనీ మంగళవారం కోర్టుకి తెలిపింది. గర్భవతి అయిన రేఖ (పేరు మార్చాం) అనే ఉద్యోగినికి కంపెనీ డిసెంబరు 22, 2014న ఉద్యోగం నుండి తొలగిస్తున్నామని తెలిపే ఉత్తర్వులు ఇచ్చింది. జనవరి 21, 2015నుండి ఆమె ఉద్యోగానికి రానవసరం లేదని కూడా అందులో తెలిపింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఆమె కోర్టులో కేసు వేసింది. జనవరి 13న కోర్టు ఆమె ఉద్యోగ తొలగింపుపై నాలుగువారాల పాటు స్టేని ఇచ్చింది. తిరిగి కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం కేసు కోర్టులో విచారణకు వచ్చినపుడు కంపెనీ న్యాయవాది, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌ సుబ్బయ్యకు రేఖ ఉద్యోగ తొలగింపు ఉత్తర్వులు రద్దుచేసినట్టుగా వెల్లడించారు. దాంతో న్యాయమూర్తి కేసుని మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. కంపెనీ, అసిస్టెంటు కన్సల్టెంటు ఆపై హోదాల్లో పనిచేస్తున్న 25వేలమంది ఉద్యోగులను అక్రమంగా తొలగించిందని రేఖ కోర్టుకి తెలిపింది. అందుకు ప్రతిగా క్యాంపస్‌ ఎంపికల్లో 55వేలమందికి ఉద్యోగాలిచ్చిందని, ఖర్చు తగ్గించుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని రేఖ కోర్టుకి వెల్లడించింది.ఎయిర్‌పోర్టు ఉద్యోగుల సమ్మె హెచ్చరిక
Posted on: Mon 19 Jan 00:46:24.785033 2015

                         న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలన్న ఆలోచనను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని,లేదంటే సమ్మె చేయక తప్పదని ఎయిర్‌పోర్టు అథారిటీ ఉద్యోగుల యూనియన్‌ హెచ్చరించింది.ఈ మేరకు పౌరవిమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజుకు ఒక లేఖ రాసింది. దేశంలోని చెన్నరు, కొల్‌కతా, జైపూర్‌, అహ్మదాబాద్‌ నాలుగు విమానాశ్రయాల నిర్వహణ, కార్యకలాపాలు, విస్తరణను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై యూనియన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కొన్నాళ్లక్రితం ప్రభుత్వం ఆమోదించిన త్రిసభ్యకమిటీ సిఫార్సులను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. లేఖ ప్రతులను ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఆర్థికమంత్రి, ఎయిర్‌పోర్టు అథారిటీ చైర్మన్‌, కార్మికశాఖ ముఖ్యకమిషనర్‌, పర్యాటక, రవాణా, సాంస్కృతిక విభాగాల పార్లమెంటరీ పానెల్‌కు పంపినట్లు యూనియన్‌ తెలిపింది. పిపిపి కింద గత యుపిఎ ప్రభుత్వం విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని భావించినా ఉద్యోగుల వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని యూనియన్‌ లేఖలో పేర్కొంది. ప్రభుత్వ విమానాశ్రాయాలతో పోలిస్తే ప్రైవేటు విమానాశ్రయాల వద్ద ప్రయాణీలకు సేవా రుసుము మరింత భారం కానుందన్నారు. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, ముంబయి విమానాశ్రయాలు ప్రైవేటు జివికె, జిఎంఆర్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ప్రయాణం మరింత ఖరీదైందని గుర్తుచేశారు.
బిఎస్‌ఎన్‌ఎల్‌ రక్షణ కోసం సమరం
Posted on: Wed 21 Jan 00:42:21.209613 2015

- ఎపి సర్కిల్‌ మహాసభల్లో సిహెచ్‌. నర్సింగరావు
ప్రజాశక్తి - రాజమండ్రి ప్రతినిధి
         ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ రక్షణ కోసం ఉద్యోగులంతా సమర శంఖారావం పూరించాలని సిఐటియు ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎపి సర్కిల్‌ 4వ మహాసభలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళాకేంద్రం ఎస్‌ఆర్‌ నాయక్‌ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నర్సింగరావు ప్రారంభోపన్యాసం చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు ప్రభుత్వాల విధానాలే కారణమని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న అవసరాలు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనీయకుండా బిఎస్‌ఎన్‌ఎల్‌ను అడ్డుకుంటూ, రిలయన్స్‌, ఐడియా వంటి బహుళజాతి కంపెనీలకు అవకాశాలు కల్పిస్తున్నారని విమర్శించారు. రూ.80 వేల కోట్లు లాభాల్లో ఉన్నప్పుడు ఆధునీకరణ కాకుండా ప్రభుత్వం అడ్డుకుందని చెప్పారు. శాటిలైట్‌ ద్వారా కమ్యూనికేషన్‌ సమాచారం అందించడానికి బిఎస్‌ఎన్‌ఎల్‌కు అవసరమైన పరిజ్ఞానమున్నా పక్కనబెట్టడంతో, ఐదేళ్ల నుంచీ నష్టాల్లోకి వెళ్లిపోయిందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ చీఫ్‌ పాట్రన్‌ విఎఎన్‌ నంబూద్రి మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్‌ పరిరక్షణ కోసం ఫిబ్రవరి 25న చలో పార్లమెంట్‌ చేపట్టి, ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలతో ప్రధానికి వినతిపత్రం అందజేస్తామన్నారు. మార్చి 17 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నామన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ అంశం మాట్లాడతానని రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యుడు మాగంటి మురళీమోహన్‌ చెప్పారు. ప్రభుత్వాలు ప్రైవేట్‌ సంస్థలకు కొమ్ముకాయడం విచారకరమని రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. ఎపి సర్కిల్‌ అధ్యక్షుడు మోహనరెడ్డి అధ్యక్షత వహించిన సభలో రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మేయర్‌ పంతం రజనీశేషసాయి, కార్యదర్శి జె.సంపతరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.అభిమన్యు, జాతీయ ఉపాధ్యక్షుడు పి.అశోక్‌బాబు, ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మహేశ్వరరావు, వర్కింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు, అధ్యక్షులు ఐ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన సుమారు రెండు వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభ సభ అనంతరం రాజమండ్రిలో భారీ ప్రదర్శన నిర్వహించారు.ప్రైవేటు వైద్యపరీక్షలు విరమించుకోవాలి యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌
Posted on: Mon 19 Jan 23:41:42.437994 2015

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
                ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను ప్రైవేటు పరం చేయడం దారుణమని అటువంటి ప్రయత్నాలను మానుకోవాలని యునైటెడ్‌ మెడిక ల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ( సిఐటియు ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తామన్న ప్రభుత్వం వైద్య పరీక్షలను ప్రైవేటు పరం చేయడం సరైంది కాదని, ఇలా చేయడం ప్రభుత్వం తన బాధ్యత నుంచి వైదొలగడమే అవు తుందనిఆయూనియన్‌ గౌరవాధ్యక్షలు ఎవి నాగే శ్వరరావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తాళ్ళూరి వెంకటేశ్వర్లు, వలివెల శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో డబ్బు చెల్లించిన వారికే వైద్య పరీక్షలు అందించే విధానం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లను రెగ్యులరైజ్‌ చేయాలని, ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌, అల్ట్రాసౌండ్‌ తదితర 72 రకాల వైద్య పరీక్షలను ప్రభుత్వ సిబ్బందితోనే నిర్వహంచాలని కోరారు. చిత్తూరు చక్కెర కర్మాగారం మూత
Posted on: Sun 18 Jan 02:08:07.518374 2015

- 463 కార్మికులు తొలగింపు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
      చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ మూత పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో రైతు లెవ్వరూ చెరుకు తోలకపోవడం, దీన్ని సాకుగా చూపించి నష్టాలున్నాయనే సాకుతో ఇందులో పని చేస్తున్న 463 కార్మికులను తొలగిస్తూ పాలక వర్గం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని సంక్రాంతి పండుగ తరువాత పనిలోకి వెళ్లిన కార్మికులకు యాజమాన్యం చెప్పడంతో ఆయా కుటుంబాలు వీధిన పడ్డట్టయ్యింది. చిత్తూరు జిల్లాలో లక్షల మంది రైతులకు ఆదరువుగా ఉన్న ఈ ఫ్యాక్టరీ మూత పడడంతో అన్నదాతల కష్టాలు ప్రారంభం కానున్నాయి.
చిత్తూరు జిల్లా చెరకు రైతులకు చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం కల్పతరువుగా ఉంది. రాష్ట్రంలో మెదక్‌ జిల్లా ఫ్యాక్టరీ తరువాత ఇది రెండో స్థానంలో ఉంది. దీనికి 13 వేల మంది రైతులు షేర్‌ హోల్డర్లుగా ఉన్నారు. ప్రయివేటు ఫ్యాక్టరీల దోపిడీ నుంచి రైతులను కాపాడడంలో ఇది ముందంజలో ఉంది. జిల్లాలో మూడు ప్రయివేటు, రెండు సహకార రంగంలో ఉన్నాయి. ప్రతి ఏటా చెరకు మద్దతు ధర ప్రకటించాలంటే చిత్తూరు ఫ్యాక్టరీవైపే మిగిలినవన్నీ చూస్తుంటాయి. ఇది ధరను నిర్ణయించిన తరువాత దాని కనుగుణంగా మిగిలిన ప్రయివేటు ఫ్యాక్టరీలు కూడా ప్రకటిస్తాయి. ఇంతగా ఇది ప్రాముఖ్యత సంపాదించుకుంది.