21, జనవరి 2015, బుధవారం

మహిళా ఉద్యోగి తొలగింపు ఉత్తర్వు రద్దు
Posted on: Wed 21  2015

- కోర్టు జోక్యంతో దిగివచ్చిన టాటా
    చెన్నై: నిబంధనలకు విరుద్ధంగా టాటా కన్సల్టెన్సీ కంపెనీ తనని ఉద్యోగం నుండి తొలగించడంపై ఒక మహిళా ఉద్యోగి కోర్టుకెక్కారు. దాంతో ఆ కంపెనీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మహిళకు ఇచ్చిన ఉద్యోగ తొలగింపు ఉత్తర్వులను రద్దు చేసినట్టుగా కంపెనీ మంగళవారం కోర్టుకి తెలిపింది. గర్భవతి అయిన రేఖ (పేరు మార్చాం) అనే ఉద్యోగినికి కంపెనీ డిసెంబరు 22, 2014న ఉద్యోగం నుండి తొలగిస్తున్నామని తెలిపే ఉత్తర్వులు ఇచ్చింది. జనవరి 21, 2015నుండి ఆమె ఉద్యోగానికి రానవసరం లేదని కూడా అందులో తెలిపింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఆమె కోర్టులో కేసు వేసింది. జనవరి 13న కోర్టు ఆమె ఉద్యోగ తొలగింపుపై నాలుగువారాల పాటు స్టేని ఇచ్చింది. తిరిగి కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం కేసు కోర్టులో విచారణకు వచ్చినపుడు కంపెనీ న్యాయవాది, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌ సుబ్బయ్యకు రేఖ ఉద్యోగ తొలగింపు ఉత్తర్వులు రద్దుచేసినట్టుగా వెల్లడించారు. దాంతో న్యాయమూర్తి కేసుని మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. కంపెనీ, అసిస్టెంటు కన్సల్టెంటు ఆపై హోదాల్లో పనిచేస్తున్న 25వేలమంది ఉద్యోగులను అక్రమంగా తొలగించిందని రేఖ కోర్టుకి తెలిపింది. అందుకు ప్రతిగా క్యాంపస్‌ ఎంపికల్లో 55వేలమందికి ఉద్యోగాలిచ్చిందని, ఖర్చు తగ్గించుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని రేఖ కోర్టుకి వెల్లడించింది.ఎయిర్‌పోర్టు ఉద్యోగుల సమ్మె హెచ్చరిక
Posted on: Mon 19 Jan 00:46:24.785033 2015

                         న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలన్న ఆలోచనను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని,లేదంటే సమ్మె చేయక తప్పదని ఎయిర్‌పోర్టు అథారిటీ ఉద్యోగుల యూనియన్‌ హెచ్చరించింది.ఈ మేరకు పౌరవిమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజుకు ఒక లేఖ రాసింది. దేశంలోని చెన్నరు, కొల్‌కతా, జైపూర్‌, అహ్మదాబాద్‌ నాలుగు విమానాశ్రయాల నిర్వహణ, కార్యకలాపాలు, విస్తరణను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై యూనియన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కొన్నాళ్లక్రితం ప్రభుత్వం ఆమోదించిన త్రిసభ్యకమిటీ సిఫార్సులను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. లేఖ ప్రతులను ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఆర్థికమంత్రి, ఎయిర్‌పోర్టు అథారిటీ చైర్మన్‌, కార్మికశాఖ ముఖ్యకమిషనర్‌, పర్యాటక, రవాణా, సాంస్కృతిక విభాగాల పార్లమెంటరీ పానెల్‌కు పంపినట్లు యూనియన్‌ తెలిపింది. పిపిపి కింద గత యుపిఎ ప్రభుత్వం విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని భావించినా ఉద్యోగుల వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని యూనియన్‌ లేఖలో పేర్కొంది. ప్రభుత్వ విమానాశ్రాయాలతో పోలిస్తే ప్రైవేటు విమానాశ్రయాల వద్ద ప్రయాణీలకు సేవా రుసుము మరింత భారం కానుందన్నారు. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, ముంబయి విమానాశ్రయాలు ప్రైవేటు జివికె, జిఎంఆర్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ప్రయాణం మరింత ఖరీదైందని గుర్తుచేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి