23, డిసెంబర్ 2014, మంగళవారం

కార్మికులపై నిర్బంధ కాండ !
Posted on: Tue 23 Dec 2014

 గంగవరం పోర్టు వద్ద భారీ పోలీసు బందోబస్తు
-  ధర్నాలో పాల్గొంటే అరెస్టు చేస్తామని ప్రచారం
-  భయభ్రాంతులకు గురిచేస్తున్న పోలీసులు
ప్రజాశక్తి - ఉక్కునగరం
                 గంగవరం పోర్టు కార్మికుల ఉద్యమాన్ని అణచివేయడానికి పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. గంగవరం పోర్టు వద్ద భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాలో పాల్గొంటే అరెస్టు చేస్తామని గ్రామాల్లో పోలీసులు ప్రచారం చేస్తున్నారు. దీంతో మత్స్యకారులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
            కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, బోనస్‌ తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ గంగవరం పోర్టు ఎంప్లాయీస్‌ యూనియన్‌(సిఐటియు) ఆధ్వర్యంలో మంగళవారం మహాధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో యాజమాన్యం గంగవరం పోర్టు వద్ద భారీ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసింది. డిసిపి రామ్‌గోపాల్‌ నాయక్‌ పర్యవేక్షణలో 25 మంది పోలీసు అధికారులు, 430 మంది పోలీసులు అక్కడ మోహరించారు. వీరంతా గంగవరం జాలారిపల్లిపాలెం, పల్లిపాలెం, పెదపల్లిపాలెం, చినపల్లిపాలెం, పెదగంట్యాడ దిబ్బపాలెం, శ్రీనగర్‌ దిబ్బపాలెం, బాలచెరువు, పెదగంట్యాడ, పోర్టు రోడ్డు తదితర ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు గంగవరం పోర్టు యాజమాన్యానికి తొత్తులుగా వ్యవహరిస్తూ మత్స్యకార కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని కార్మిక సంఘాలు విమర్శిస్తున్నాయి. 23న ఎవరైనా పోర్టు వద్ద జరిగే మహాధర్నాలో పాల్గొంటే అరెస్టు చేస్తామని, 144 సెక్షన్‌ ఉందని, వీధుల్లో గుంపులుగా తిరగవద్దని, ఎవరి ఇళ్లల్లో వారే ఉండాలని పోలీసులు మత్స్యకార గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు.
             తమకు ఉపాధి కల్పించాలని 2006లో ఆందోళన చేసిన మత్స్యకార గ్రామాలపై పోలీసులు దాడిచేసి దొరికిన మత్స్యకారులందరినీ లాఠీలతో చితకబాదారు. అప్పట్లో నూకరాజు అనే మత్స్యకారుడిని తూటాలకు బలిచేశారు. ఈ సంఘటనను, ప్రస్తుత నిర్బంధాన్ని తలచుకొని మత్స్యకారులు భయాందోళనలు చెందుతున్నారు. యాజమాన్యం, పోలీసుల నిర్బంధ చర్యలను సిఐటియు నగర కమిటీ తీవ్రంగా ఖండించింది.

బొబ్బిలిలో జ్3యూట్‌ మిల్‌ అక్రమ లాకౌట్‌
Posted on: Tue 23 Dec 2014
-  
రోడ్డునపడ్డ 300 కార్మిక కుటుంబాలు
-  నిరసనగా రాస్తారోకో
ప్రజాశక్తి - బొబ్బిలి(విజయనగరం జిల్లా)
               తమ జీతాల నుంచి ప్రతినెలా కోత విధిస్తున్న పిఎఫ్‌ సొమ్మును ఆయా ఖాతాలకు జమ చేయాలని కార్మికులు అడగడాన్ని జీర్ణించుకోలేకపోయింది యాజమాన్యం. దీంతో అక్రమ లాకౌట్‌ విధించి తన కార్మిక వ్యతిరేక వైఖరిని ప్రదర్శించుకుంది. ఈ సంఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో సోమవారం చోటుచేసుకుంది. స్థానిక నవ్య జ్యూట్‌మిల్‌ యాజమాన్యం వైఖరి కారణంగా మిల్లులో పని చేస్తున్న మూడొందల కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
వేతనాల నుంచి పిఎఫ్‌ సొమ్ము కోత పెడుతున్నప్పటికీ ఏడు నెలలుగా ఆయా ఖాతాలకు జమ చేయడం లేదు. ఈ సొమ్ము జమ చేయాలని, పండుగ అడ్వాన్స్‌ ఇవ్వాలని కార్మికులు కోరడంతో సోమవారం యాజమాన్యం మిల్లును లాకౌట్‌ చేసింది. దీంతో కార్మికులు పరిశ్రమ గేటు వద్ద ఆందోళన చేశారు. యాజమాన్యం వైఖరికి నిరసనగా ఆర్టీసి కాంప్లెక్స్‌ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు రెడ్డి వేణు మాట్లాడుతూ, ఉత్పత్తి పేరుతో కార్మికులకు వేధించడం దుర్మార్గమన్నారు. తక్షణమే కార్మిక శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు కలుగజేసుకుని కార్మిక సమస్యలను పరిష్కరించి మిల్లును తెరిపించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో నవ్య జ్యూట్‌మిల్‌ అధ్యక్షులు టి.సత్యారావు, కోశాధికారి ఎన్‌.నాగరాజు, సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.

ఎపి ఎమ్మెల్యే క్వార్టర్లలో తాత్కాలిక సిబ్బంది జీతాలు పెంచాలి
Posted on: Tue 23 Dec 2014
- స్పీకర్‌ కోడెలకు భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య లేఖ
లప్రజాశక్తి, హైదరాబాద్‌ బ్యూరో
                ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర శాసనసభ్యుల వసతి గృహాలలో పనిచేస్తున్న స్వీపర్లుకు తెలంగాణ బ్లాకులో పనిచేస్తున్న వారికి వేతనాలు చెల్లిస్తున్నట్లు చెల్లించాలని శాసనసభ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివప్రసాదరావుకు భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ సిపిఐ(ఎం) సభాపక్ష నాయకుడు సున్నం రాజయ్య రాసిన లేఖలో కోరారు. న్యూ ఎమ్మెల్యే, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్లలో స్వీపర్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, లిఫ్టు ఆపరేటర్లు, కార్పెంటర్లుగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో గత 9 ఏళ్లుగా పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం వీరికి రెండు విభాగాలుగా విభజన చేసి, ఆంధ్ర, తెలంగాణ బ్లాక్‌లకు కేటాయించారని, గత రెండు రెండేళ్ల క్రితం శాసన సభ ఉత్తర్వుల ప్రకారంగా కనీస వేతనాలు ఇవ్వాలని అనేక విజ్ఞప్తుల మేరకు తెలంగాణ బ్లాకులో పనిచేస్తున్న వారికి మాత్రమే నక్షత్ర ఏజెన్సీ ద్వారా వేతనాలు పెంచి అందజేస్తున్నారని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో ఆంధ్రా బ్లాక్‌కు కేటాయించిన వారికి వేతనాలు ఇప్పటి వరకూ పెంచలేదని, రెండు రాష్ట్రాలకు కేటాయించిన బ్లాకులలో పనిచేస్తున్న వారికి ఒకేసారి వేతనాలు ఇవ్వకుండా, వివక్షచూపడం సరికాదని రాజయ్య తన లేఖలో పేర్కొన్నారు. కార్మికులు గత నెలరోజులుగా అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణాలో వేతనాలు అందజేస్తుంటే, ఆంధ్రా బ్లాకుకు కేటాయించిన సిబ్బందికి ఇవ్వకపోవడం కార్మికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అంశంగా భావించాలని స్పీకర్‌కు తెలిపారు. తక్షనే సంబంధిత అధికారులతో విచారణ జరిపించి అసెంబ్లీ ఉత్తర్వుల ప్రకారంగా తెలంగాణ బ్లాకు సిబ్బందికి చెల్లిస్తున్నట్లే, ఆంధ్రా బ్లాకులో పనిచేస్తున్న వారికీ సమాన వేతనాలు ఇవ్వాలని ఎమ్మెల్యే సున్నం రాజయ్య స్పీకర్‌ కోడెలను లేఖలో కోరారు.

కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తున్నాం
Posted on: Tue 23 Dec  2014
- రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి యనమల
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
                రాష్ట్రంలో ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని రాష్ట్ర ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. నాలుగవ రోజు సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో విపక్ష సభ్యులు ఎస్‌వి మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు ఔట్‌సోర్సింగ్‌ పద్దతి ద్వారా పోస్టుల భర్తీతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై అడిగిన ప్ర శ్నకు మంత్రి బదులిచ్చారు. మేనిఫెస్టోలో పొందుపర్చిన విధంగా ఇంటికో ఉద్యోగం తప్పనిసరిగి ఇస్తామని మంత్రి వివరించారు. గతంలో అనేకమందికి అప్పటి ప్రభుత్వం అర్హత లేకపోయినా ఉద్యోగ అవకాశాలు కల్పించిందని, దాంతో ప్రస్తుతం అలాంటి వారిని తొలగించడం జరుగుతోందని యనమల తెలిపారు. ఇదే అంశంపై విపక్ష సభ్యులు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్లు లేకుండా ఉర్దూ ఉపాధ్యాయుల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల భర్తీలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం ఏమైందని ఆయన నిలదీశారు. దీనిపై మంత్రి బదులిస్తూ ప్రభుత్వ, ప్రైవేట్‌ సెక్టార్లలో నిరుద్యోగం లేకుండా చేస్తామన్నారు. నిరుద్యోగ భృతిని ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నామని యనమల తెలిపారు. రాష్ట్రంలో 9 శాతం నిరుద్యోగులు ఉన్నారని, త్వరలో నోటిఫికేషన్లు జారీ చేస్తామని ఆయన చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం ఆ దిశగా పనిచేస్తోందన్నారు.

పర్యవసనాలకు ప్రభుత్వానిదే బాధ్యత: సిఐటియు
Posted on: Tue 23 Dec2014
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
             ఐకెపి యానిమేటర్ల సమస్యలు పరిష్కరించ కుంటే భవిష్యత్‌లో జరిగే పర్యవసనాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని సిఐటియు పేర్కొంది. ఈ మేరకు ఆ సంఘ అధ్యక్షులు ఎస్‌. పుణ్యవతి, ప్రధాన కార్యదర్శి ఎంఎగఫూర్‌, కోశాధికారి ఎ.వి నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. యానిమేటర్లను, వారి కుటుంబసభ్యులను ఎక్కడికక్కడ అరెస్ట్‌చేసి, నిర్బందించి ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించిందని వారు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు కుమ్మక్కై ఛలో అసెంబ్లీని అడ్డుకున్నాయని వారు తెలిపారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా సమస్యలను ప్రభుత్వంతో చర్చించకుండా ఆందోళనలు చేపట్టారని ప్రకటించడాన్ని వారు ఖండించారు. ముఖ్యమంత్రితో పాటు ఆర్థికశాఖ, సంబంధిత శాఖ మంత్రుల దృష్టికి ఎన్నో సార్లు ఈ విషయాన్ని తీసుకువెళ్లామని అన్నారు.

పారిశుద్ధ్యేతర కార్మికుల జీతాలు పెంపు
Posted on: Sun 21 Dec  2014

ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌
ఎంప్లాయిస్‌ యూనియన్‌ హర్షం
ప్రజాశక్తి, హైదరాబాద్‌ బ్యూరో
                       రాష్ట్రంలోని మున్సిపాల్టిలు, కార్పొరేషన్‌లు, నగర పంచాయితీలలో పనిచేస్తున్న పారిశుద్ధేతర కార్మికులకు జీతాలు (మధ్యంతర భృతి) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మెమో నెం. 10835/జి2/2013ను జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం వీరికి 26శాతం జీతాల (మధ్యంతర భృతి)పెంపుజరగనుంది. ప్రభుత్వం జారీ చేసిన మెమోపై ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ (సిఐటియు అనుబంధం) యూనియన్‌ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 20వ తేదినుండి జరపతలపెట్టిన సమ్మెను విరమించినట్లు పేర్కొ న్నారు. రాష్ట్రంలోని 113 మున్సిపాలిటీలలో మంచి నీరు, ఎలక్ట్రీషియన్స్‌, పార్కులు, డ్రైవర్లు, బిల్‌ కలెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్స్‌ తదితర విభాగాలకు చెందిన కార్మికులకు మధ్యంతర భృతి (జీతాల పెంపు)తో యూనియన్‌ అధ్యక్షురాలు కె.సామ్రాజ్యం, ప్రధానకార్యదర్శి కె.ఉమామహేశ్వర రావులు మున్సిపల్‌శాఖ మంత్రి డాక్టర్‌ పి.నారాయణకు, మున్సిపల్‌ పరిపాలనాశాఖాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గత ఆరు నెలలుగా ఇంజినీరింగ్‌ విభాగంలో కార్మికుల జీతాలు పెంపుకోసం సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనలు, పోరాటాలు నిర్వహిం చామని, ఆగస్టు 1వ తేదీ నుండి మెరుపు సమ్మె చేయడమే కాకుండా ఈనెల 20 తేదీ లోగా సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళతామని ఈనెల 16న మంత్రి నారాయణకు స్పష్టం చేస్తూ నోటీసు అందజేశామన్నారు. వీటితోపాటు ఈ నెల 15న మున్సిపల్‌ కార్యాలయాల వద్ద, శుక్రవారం ఆయా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద పెద్దఎత్తున ధర్నా నిర్వహించామని ఉమామహేశ్వరరావు తెలిపారు. సంఘటితంగా పోరాడి మెమోను సాధించుకున్న కార్మికులందరికీ రాష్ట్ర కమిటీ అభినందనలు తెలియజేసింది. రాష్ట్రంలో మున్సిపల్‌ స్వీపర్స్‌, ఎన్‌.ఎం.ఆర్‌లు, ఎ.ఎన్‌.ఎం విభాగాలకు చెందిన వారి సమస్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, అలాగే 10వ పీఆర్‌సి నివేదిక ప్రభుత్వం ప్రకటించాల్సి ఉందన్నారు. ఈ నివేదిక ప్రకారం కనీస వేతనం రూ.15,000కు పెంచాల్సి ఉందని, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్దీకరణ, సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎ.పి.మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ (సిఐటియు అనుబంధం) యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు డిమాండ్‌ చేశారు.


విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు ఫెడరేషన్‌ మద్దతు
Posted on: Sun 21 Dec 2014
ప్రజాశక్తి, హైదరాబాద్‌ బ్యూరో
         ఎపి విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారానికి చేపట్టిన సమ్మెకు ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు అండ్‌ అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ తన పూర్తి మద్దతును ప్రకటించింది. ఈమేరకు ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు, ప్రధానకార్యదర్శి బి.రవిచంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో ఐఆర్‌ చెల్లింపు, సమాన పనికి సమాన వేతనాలు వంటి సమస్యలపై ప్రభుత్వం లిఖితపూర్వకమైన హామీ ఇవ్వకపోవడం వల్లే సమ్మె అనివార్యమైందని వారు తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తామని, వేతనాలు పెంచుతామని ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో హామి ఇచ్చిందని, ఈ హామీలను అమలు చేయాలనే విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు సమ్మె చేస్తున్నారన్నారు. ఈ సమ్మెకు వివిధ ప్రభుత్వ శాఖలు, పథకాలు యూనివర్శిటీల కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘాలన్నీ మద్దతు తెలపాలని వారు పిలుపునిచ్చారు.
రేపు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ధర్నా
               రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కొనసాగించాలని, వారి సర్వీసులను క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 22వ తేదీ (సోమవారం) రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఎపి స్టేట్‌ గవర్నమెంట్‌ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నిర్ణయించింది. శనివారం ఫెడరేషన్‌ అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వరరావు విడుదల చేసిన ప్రకటనలో ఈనెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి పోస్టుకార్డుల క్యాంపెయిన్‌ నిర్వహించాలన్నారు. ఈనెల 31వ తేదీతో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది కాలపరిమితి ముగియనుండటంతో ఉద్యోగులు అందోళనతో ఉన్నారని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన విధంగా ఉద్యోగుల సేవలను కొనసాగించడంతో పాటు, వారిని రెగ్యులరైజ్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.


'అరబిందో' కార్మికుల ధర్నా
Posted on: Sat 20 Dec 2014

 సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం : కార్మిక సంఘాలు
ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌
               తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం విజయనగరం కలెక్టరేట్‌ వద్ద అరబిందో కార్మికులు తమ కుటుంబాలతో సహా ధర్నా చేశారు. పలు కార్మిక సంఘాల ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్‌ ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ఇఫ్టూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.సన్యాసిరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు వి.కృష్ణంరాజు, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షులు ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలోని అరబిందో ఫార్మా కంపెనీ అగ్రిమెంటు ప్రకారం వేతనాన్ని పెంచాలని కార్మికులు అడిగితే కక్షసాధింపు చర్యలకు పాల్పడడం అప్రజాస్వామికమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కార్మిక మంత్రి కె.అచ్చెన్నాయుడు యాజమాన్యం కొమ్ముగాస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. అరబిందో కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకూ ఆందోళన కొనసాగుతుందన్నారు. అనంతరం కలెక్టర్‌ ఎంఎం నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.లక్ష్మి, రమణి, లక్ష్మణరావు, సిపిఐ నాయకులు బి.సూరిబాబు, అధిక సంఖ్యలో అరబిందో కార్మికులు పాల్గొన్నారు.

దద్దరిల్లిన కలెక్టరేట్లు
Posted on: Sat 20 Dec  2014
-  
కదంతొక్కిన మున్సిపల్‌ కార్మికులు
ప్రజాశక్తి - యంత్రాంగం
               నిర్ణీత తేదీకే వేతనాలు చెల్లించాలని తదితర తమ 18 డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ మున్సిపల్‌ కార్మికులు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, ర్యాలీలు, మానవహారాలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రకటించిన మధ్యంతర భృతిని పురపాలక సంఘాల్లో పని చేస్తున్న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులకు వర్తింపజేయాలని పెద్దపెట్టున నినాదాలు చేశారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో ఎపి మునిసిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, మునిసిపల్‌ కార్మికులకు తక్షణం వేతనసవరణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విశాఖ కలెక్టరేట్‌ వద్ద జివిఎంసి ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన మహాధర్నా నిర్వహించారు. సిఐటియు నగర ప్రధాన కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడుతూ, కార్మికులకు 3 నెలులుగా జివిఎంసి అధికారులు జీతాలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. నగరంలోని ఓ హోటల్‌లో సిఎం చంద్రబాబు ఉన్నారన్న సమాచారంతో కార్మికులు అక్కడకు ర్యాలీగా బయలుదేరగా, పోలీసులు అడ్డుకున్నారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నాలో యూనియన్‌ జిల్లా గౌరవాధ్యక్షులు బి.సోమయ్య ప్రసంగించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కలెక్టరేట్‌ వద్ద, మార్కాపురంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద మున్సిపల్‌ కాంట్రాక్టు కార్మికులు శుక్రవారం ధర్నా చేపట్టారు. కడపలో ర్యాలీ చేసి, కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

స్కీం వర్కర్ల జీవన పోరాటం
Posted on: Fri 19 Dec 2014

- రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల దిగ్బంధం - ఎక్కడికక్కడ అరెస్టులు
- ప్రజా సంక్షేమం పట్టని ప్రభుత్వం : రాఘవులు
- మహిళలను ఏడిపిస్తే పుట్టగతులుండవ్‌ : పుణ్యవతి
- 22న అసెంబ్లీ ముట్టడి : గపూర్‌
- విజయవంతమైన ఒక్కరోజు సమ్మె
ప్ర్రజాశక్తి - యంత్రాంగం
                        తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకెపి యానిమేటర్లు, తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న చిరుద్యోగులు(స్కీం వర్కర్లు) సిఐటియు ఆధ్వర్యంలో కదం తొక్కారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లను వేలాదిగా తరలివచ్చి ముట్టడించారు. దీంతో పలుజిల్లాల్లో ప్రభుత్వం పోలీసులతో అక్రమ అరెస్టులకు ఒడిగట్టింది. పలుచోట్ల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళనలు నిర్వహించారు. పార్టీలకతీతంగా ఈ కార్యక్రమానికి మద్దతివ్వడం విశేషం.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో స్కీం వర్కర్లు గుంటూరు కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్యక్రమంలో సిపిఎం, కాంగ్రెస్‌, వైసిపి నాయకులు పాల్గొని సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాట్లాడుతూ, నవ్యాంధ్రలో 6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే వారిలో సగం మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోవట్లేదని అన్నారు. ప్రభుత్వం టిడిపి నాయకుల కోసం పనిచేస్తోందా? ప్రజల కోసం పనిచేస్తోందా? అని ప్రశ్నించారు. అనంతరం ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి, అంగన్‌వాడీ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రోజా మాట్లాడారు. కృష్ణాజిల్లా కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో మధ్యాహ్న భోజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.స్వరూపరాణి తదితరులు మాట్లాడారు. నెల్లూరులో కలెక్టరేట్‌ వరకూ ప్రదర్శన నిర్వహించి, కలెక్టరేట్‌ను ముట్టడించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు పుణ్యవతి మాట్లాడుతూ, మహిళలను ఏడిపిస్తే పుట్టగతులుండవన్నారు. ప్రభుత్వం వాగ్దానాలకు విరుద్ధంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగిస్తామని చెప్పడం దారుణమన్నారు. కర్నూలు కలెక్టరేట్‌ ఎదుట ప్రశాంతంగా నిరసన తెల్పుతున్న సమయంలో పోలీసులు అక్రమ అరెస్టులకు పూనుకున్నారు. అరెస్టయిన వారిలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్‌ సహా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, నగర అధ్యక్ష, కార్యదర్శులు తదిత రులున్నారు. ముట్టడిలో ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ, స్కీమ్‌ వర్కర్ల సమస్యలపై 22న అసెంబ్లీ ముట్టడిం చనున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లాలో కలెక్టరేట్‌ గేట్లకు తాళాలేసి బైఠాయించారు. ఉద్యోగులను 6 గంటలపాటు కలెక్టరేట్‌ను దిగ్బంధించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు లలితమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, నగర కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ఇంతియాజ్‌, జి.ఓబులు ఉన్నారు. ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడి పోలీసుల రంగ ప్రవేశంతో ఉద్రిక్తంగా మారింది. నాయకులను ఈడ్చికెళ్లి వ్యాన్‌లో కుక్కారు. వేటపాలెం ప్రాజెక్టుకు చెందిన అంగన్‌ వాడీ కార్యకర్తల బుల్లామ్మాయి స్పృహతప్పి పడిపో యింది. నేతల అరెస్టులను నిరసిస్తూ టుటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించడంతో అరెస్టు చేసినవారిని విడుదల చేశారు. ఆందోళనలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామ హేశ్వరరావు పాల్గొ న్నారు. శ్రీకాకుళం, విజయనగరం కలెక్టరేట్లను స్కీం వర్కర్లు ముట్టడించారు. కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.అజయశర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలో జరిగిన ఆందోళనకు కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణీ సంఘీభావం తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కలెక్టరేట్‌ ముట్టడి, అనంతరం జరిగిన సభలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామ హశ్వరరావు మాట్లాడారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్‌ను ముట్టడించారు. చిత్తూరు కలెక్ట రట్‌ను ముట్టడించిన నాయకులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి అజరు కుమార్‌, కందారపు మురళి, తదితరులున్నారు. కడప కలెక్టరేట్‌ను ముట్టిడిలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.ధనలక్ష్మి పాల్గొన్నారు.


విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమ్మెకు సిఐటియు మద్దతు
Posted on: Fri 19 Dec 2014
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
                         విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులు చేస్తున్న సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు పుణ్యవతి, ఎంఏ గఫూర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సమ్మెను సంపూర్ణంగా బలపరుస్తున్నట్లు వారు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు బేషరత్తుగా రెగ్యులరైజ్‌ చేయాలని, రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్టు కార్మికులకు వారితో సమానంగా వేతనాలు చెల్లించాలని సిఐటియు డిమాండ్‌ చేస్తోందని వారు పేర్కొన్నారు.విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులందరూ ఐక్యంగా పోరాటం చేయటం ద్వారానే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, సమస్యలు పరిష్కారం చేసుకోవడం సాధ్యమవుతుందని తెలిపారు. విద్యుత్‌ కార్మికులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలపాలని సిఐటియు శ్రేణులకు వారు పిలుపునిచ్చారు.


కాంట్రాక్టు సిబ్బంది సేవలు కొనసాగించండి
Posted on: Thu 18 Dec 00:04:43.978469 2014

ఎపి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌
ప్రజాశక్తి, హైదరాబాద్‌ బ్యూరో
                     ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న  సిబ్బంది సేవలను కొనసాగించడంతో పాటు వారికి డి.ఎ సౌకర్యం కల్పించాలని ఎపి ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. ఈమేరకు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్సీలుకె.ఎస్‌.లక్ష్మణరావు, వై.శ్రీనివా సులురెడ్డి,ఎం.గేయానంద్‌, వి.బాలసుబ్ర హ్మణ్యం, అధ్యక్షుడు ఎ.వి.నాగేశ్వర రావులు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర కాంట్రాక్టు ఉద్యోగుల కమిటీ కన్వీనర్‌ అయిన డాక్టర్‌ పి.వి.రమేష్‌కు వినతిపత్రాన్ని అంద జేశారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను డిసెంబరు తరువాత కొనసాగించేందుకు అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని, ఐఆర్‌ చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ, ఉద్యోగులకు డిఎ సౌకర్యాన్ని కల్పించి, ప్రమాదబీమా, గ్రాట్యూటీ సౌకర్యాలు అందించాలన్నారు. 2/94 చట్టాన్ని సవరించి, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, కంటింజెంట్‌, టైంస్కేల్‌, డైలీవేజ్‌, ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. రాష్ట్రంలో తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతోపాటు, సొసైటీలలో పనిచేస్తున్న వారు సుమారు 3 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, వారి సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి పనిచేయాలని వారు డిమాండ్‌ చేశారు.
                 బోధనేతర సిబ్బంది వయోపరిమితి పెంపుపై హర్షం : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న బోధ నేతర సిబ్బంది వయోపరిమితిని 58 నుండి 60 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్నా నిర్ణయాన్ని ఆల్‌ యూనివర్శిటీస్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌, సిఐటియూ, ఆల్‌ ఇండియా యూనివర్శిటీ ఎంప్లాయిస్‌ కాన్ఫెడరేషన్‌ అనుబంధ కమిటి ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తాజా నిర్ణయాన్ని జూన్‌ 2014 నుండి వర్తించే విధంగా ప్రభుత్వ చర్యలు చేపట్టినందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. యూనివర్శిటీ ఉద్యోగులకు హెల్త్‌ కార్డులు, టైం స్కేల్‌, ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, ఉద్యోగ భద్రత వంటి సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి పరిష్కరించాలని యూనియన్‌ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.


అరబిందో' కార్మికుల సమస్యలపై సమైక్య పోరు
Posted on: Wed 17 Dec  2014
-
 రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పలు సంఘాల నిర్ణయం
ప్రజాశక్తి - విజయనగరం టౌన్‌
                    అరబిందో ఫార్మా ఉద్యోగుల సమస్యలపై సమైక్యంగా పోరాడాలని పలు సంఘాలు తీర్మానించాయి. అరబిందో ఫార్మా ఉద్యోగ సంఘం ఆధ్వర్యాన ఎన్జీవో హోమ్‌లో బుధవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ నెల 19న కలెక్టర్‌ను కలిసి కార్మికుల సమస్యలపై చర్చించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా పలు సంఘాల నాయకులు మాట్లాడుతూ అరబిందో ఫార్మా కంపెనీలో యూనియన్‌ పెట్టుకునేందుకు యాజమాన్యం అంగీకరించకపోవడంతో ఆందోళనలకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. వేతన సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తే యూనియన్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పూనుకోవడం, కార్మికులను సస్పెండ్‌ చేయడం, కార్మికులను అర్ధరాత్రి అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. వీరికి మద్దతు పలికేందుకు శ్రీకాకుళం వస్తున్న వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులను అరెస్టు చేయడం దారుణమని తెలిపారు. అప్రజాస్వామిక చర్యలకు ఒడిగడుతున్న అరబిందో ఫార్మా కంపెనీపై ఒత్తిడి తేవాలని, తొలగించిన ఉద్యోగులందరినీ విధుల్లోకి తీసుకునే వరకూ పోరాడాలని తీర్మానించారు. ఈ సమావేశంలో సిఐటియు, ఐఎఫ్‌టియు, ఎఐటియుసి, ఆపాస్‌, ఎఐబిఇఎ, ఎపిఎస్‌ఆర్‌టిసి, విఆర్‌ఓ, ఎన్జీవో సంఘాల నాయకులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌
Posted on: Wed 17 Dec  2014

పదవీ విరమణ వయస్సు 60కి పెంపు
- సీఎం అంగీకారం
ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
                      విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచడానికీ ఆయన సుముఖత వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్‌ జేఏసీ నాయకులతో నిర్వహించిన భేటీ సందర్భంగా ఆయన వారికి ఈ మేరకు హామీ ఇచ్చారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తోన్న ఉద్యోగులకు ఇవి వర్తిస్తాయి. సమ్మెలో ఉన్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచడానికి కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. విద్యుత్‌ జేఏసీ నాయకులు సాయిబాబా, వేదవ్యాస్‌, శివకుమార్‌, కె శ్రీనివాస్‌ తదితరులు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఇంధనశాఖ కార్యదర్శి అజరుజైన్‌ ఇందులో పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. తమ రాష్ట్రంలోని విద్యుత్‌ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన విషయాన్ని జేఏసీ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని, దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలో విడుదల చేస్తామని అన్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అజరుజైన్‌కు సూచించారు. పదవీ విరమణ వయస్సు 15 ఏళ్లలోపు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు, 15 ఏళ్ల పైబడి ఉన్న వారికి మూడు ఇంక్రిమెంట్లు ఇస్తామని చంద్రబాబు అన్నారు. పింఛన్‌దారులకు 37.5 శాతం పెంచుతామని చెప్పారు. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేసిన పదవీ విరమణ వయస్సు పెంపును జెన్‌కో, ట్రాన్స్‌కో, నాలుగు డిస్కమ్‌ల ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని చంద్రబాబు అన్నారు.
                కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు విషయాన్ని జేఏసీ నాయకులు ముఖ్యమంత్రికి వివరించారు. సమాన పనికి సమాన వేతనం కోసం వారు సమ్మె చేపట్టారని అన్నారు. వారి విషయాన్ని మానవతాదృక్పథంతో పరిశీలించాలని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచిన తరువాత వారి ద్వారా కాంట్రాక్టు సిబ్బంది వేతనాన్ని పెంచేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.


విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల సమస్యలు
Posted on: Wed 17 Dec 2014
-
 అసెంబ్లీలో ప్రస్తావిస్తా : జగన్‌
ప్రజాశక్తి - విజయవాడ ప్రతినిధి/చిత్తూరు టౌన్‌
                    విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగులు తమ డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకు తమ మద్దతు ఉంటుందని, అసెంబ్లీ సమావేశాల్లో వారి సమస్యలను ప్రస్తావిస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో 13జిల్లాల స్థాయిలో కాంట్రాక్టు ఉద్యోగులు నిర్వహిస్తున్న సభకు విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఛైర్మన్‌ కెయన్‌వి.సీతారామ్‌ అధ్యక్షత వహించారు. సభలో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికుల విషయంలోనే గాక రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణాల మాఫీ వంటి విషయాల్లో మాట తప్పారని విమర్శించారు. 'చంద్రబాబు మీ సమస్యలను పరిష్కరించకపోతే మేము అధికారంలోకి రాగానే పరిష్కరిస్తాం' అని అన్నారు. జెఏసి ఛైర్మన్‌ సీతారామ్‌ మాట్లాడుతూ, విద్యుత్‌ కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్‌ ఉద్యోగులకు ఇచ్చే మూల వేతనాన్ని తక్షణమే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంట్రాక్టు వ్యవస్ధను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, దశల వారీగా క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కన్వీనరు పి.కాశీమధుబాబు మాట్లాడుతూ, దశలవారీ క్రమబద్ధీకరణ తదితర అంశాలు చర్చల ద్వారా మూడు దశల్లో అమలు చేయాలనే నిర్ణయం కోసం కొంత సమయం తీసుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. విద్యుత్‌ రంగంలో 3వ పార్టీ కాంట్రాక్టు వ్యవస్థ కనీస కార్మిక చట్టాల అమలులో ఘోరంగా విఫలమైందన్నారు.
చిత్తూరులో ధర్నా
               కాంట్రాక్టు ఉద్యోగుల్ని తొలగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ చిత్తూరు డిఇ కార్యాలయం ఎదుట కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పాండ్యన్‌ మాట్లాడారు. ఈ ధర్నాలో జెఎసి నాయకులు మహేష్‌బాబు, బాబుప్రసాద్‌, మురళి, నిరంజన్‌బాబు పాల్గొన్నారు.

కాంట్రాక్టు ఎంపిఇవోలు
Posted on: Wed 17 Dec 2014

- వ్యవసాయశాఖలో 6,354 మంది నియామకం
- ఉత్తర్వులు జారీ
- ఆర్‌ఎంజిలకు మార్గదర్శకాలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
                       ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖలో కాంట్రాక్టు పద్ధతిపై 6,354 బహుళ ప్రయోజన విస్తరణాధికారుల (మల్టీపర్పస్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌- ఎంపిఇవొ) నియామకాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాంగ్రెస్‌ హయాంలో నియమితులైన ఆదర్శ రైతు వ్యవస్థను తెలుగుదేశం సర్కారు ఇటీవల రద్దు చేసింది. దాని స్థానంలో ఎంపిఇవోలను నియమిస్తోంది. అందుకు విధి, విధానాలు నిర్ణయిస్తూ వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా మంగళవారం ఉత్తర్వులు వెలువరించారు. దానితోపాటు రైతు మిత్ర బృందాల (ఆర్‌ఎంజి) ఏర్పాటుకు మార్గదర్శకాలు జారీ చేశారు.
                       ఎపిలో 63.54 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉండగా వెయ్యి హెక్టార్లకు ఒకరు చొప్పున ఎంఇవోలను నియమిస్తారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేసే అన్ని పథకాల పర్యవేక్షణ బాధ్యత క్షేత్ర స్థాయిలో ఎంపిఇఓలదే. సాగుకు సంబంధించిన పూర్తి సమాచార సేకరణ బాధ్యత కూడా వారిదే. ఎంపిఇవో డ్యూటీ చార్ట్‌లో మొత్తం 16 విధులు చేర్చారు. పలు ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలి. కాంట్రాక్టు పద్ధతిపై నియమించే వీరికి నెలకు రూ.8 వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు. 6,354 మందిని మూడు దశల్లో నియమిస్తారు. ఈ సంవత్సరం మూడోవంతు, తతిమ్మా అధికారులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు విడతల్లో రిక్రూట్‌ చేస్తారు. బిఎస్సీ (అగ్రికల్చర్‌), బిఎస్సీ (హార్టికల్చర్‌), అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమో (ఎన్‌జి రంగా వర్శిటీ గుర్తింపు) పట్టా ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత, బిఎస్సీ, (బిజడ్‌సి), డ్రై ల్యాండ్‌ అగ్రికల్చర్‌ చదివినవారికి రెండో ప్రాధాన్యత ఉంటుంది. ఎంపికకు మూడు కేటగిరీలుగా వర్గీకరించారు.
మొదటి కేటగిరీలో పేర్కొన్న డిగ్రీలు లేకుంటే రెండు, అక్కడా అభ్యర్ధులు దొరక్కుంటే మూడవ కేటగిరీలో పేర్కొన్న క్వాలిఫికేషన్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. క్వాలిఫికేషన్‌ మెరిట్‌కు 80 శాతం, ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజి ఇస్తారు. అభ్యర్ధుల వయోపరిమితి 40 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాల సడలింపు ఉంటుంది. రిజర్వేషన్లు, రోస్టర్‌ అమలు చేస్తారు. మొత్తం పోస్టుల్లో 80 శాతం స్థానిక జిల్లా వారికి, 20 శాతం ఎపిలోని బయటి జిల్లాల వారికి కేటాయించారు. జిల్లా ఎపిక కమిటీకి కలెక్టర్‌ లేక జాయింట్‌ కలెక్టర్‌ ఛైర్‌పర్సన్‌గా ఉంటారు. జెడిఎ సభ్యకార్యదర్శి కాగా సభ్యులుగా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులుంటారు.
నియామకానికి బహిరంగ ప్రకటన చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎపిలో రైతు మిత్ర గ్రూపుల ఏర్పాటుకు కూడా మార్గదర్శకాలిచ్చారు. ఇప్పటికే ఉన్న 16,127 గ్రూపులను కొనసాగిస్తారు. కొత్తగా వంద హెక్టార్లకో గ్రూపు ఉండేటట్లు నియమిస్తారు. ప్రతి గ్రూపులో 10-15 మంది సభ్యులుంటారు. ప్రతి సభ్యుడు వంద రూపాయల సభ్యత్వం చెల్లించాలి. కొంత బ్యాంకులో పొదుపు చేయాలి. జిల్లా కలెక్టరు ఆర్‌ఎంజిల పనితీరును పర్యవేక్షిస్తారు. ప్రతి పది ఆర్‌ఎంజిలకు ఒక ఎంపిఇఒ మార్గదర్శిగా ఉంటారు.


పంచాయతీల్లో సమ్మె సైరన్‌ !   
Posted on: Tue 16 Dec 2014

 విధులు బహిష్కరించిన కార్మికులు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
            ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీలకు అప్పగిస్తే సహించేది లేదంటూ చిత్తూరు జిల్లా పంచాయతీ కార్మికులు గర్జించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లారు. జిల్లాలోని 1360 పంచాయతీల్లో ఈ ప్రభావం స్పష్టంగా కనిపించింది. జిల్లా చరిత్రలో మొదటి సారి పంచాయతీ కార్మికులు కదం తొక్కారు. తమ విధులను బహిష్కరించారు.
            1992 నుంచి పంచాయతీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న విషయం విదితమే. దాదాపు 22 సంవత్సరాలుగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారిని ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చేయాలని జిల్లా కలెక్టర్‌ సిద్థార్థజైన్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీన్ని నిరసిస్తూ పంచాయతీల్లోని కార్మికులు ఈ నెల ఒకటో తేదీ సమ్మె నోటీసు ఇచ్చారు. దీనిపై అధికారులతో జరిగిన చర్చలు విఫలయమయ్యాయి. దీంతో కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి వారు విధులను బహిష్కరించారు.ఆయా పంచాయతీ కార్యాలయం ముందు టెంట్లు వేసుకుని నిరసన తెలుపుతున్నారు. మొదటి రోజు జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు పి. చైతన్య బంగారుపాళ్యం, కాణిపాకం, పాకాల, దామలచెరువు, కల్లూరు ప్రాంతాల్లో కార్మికులకు మద్దతు ప్రకటించారు.
          అలాగే కుప్పం ప్రాంతాల్లో సిఐటియు నాయకులు ఓబుల్‌ రాజు, కార్వేటినగరంలో సుబ్రమణ్యం, తిరుపతి డివిజన్‌లో చంద్రశేఖర్‌రెడ్డి, సత్యవేడు డివిజన్‌లో రమేష్‌, చిత్తూరు డివిజన్‌లో ప్రసాద్‌, చంద్రగిరి డివిజన్‌ ప్రకాష్‌, మధులు పాల్గొన్నారు.వీరితో పాటు పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గుణశేఖర్‌రెడ్డి, జనార్థన్‌, పొన్మణి, దామోదరం, నాగయ్య, మునస్వామి లు పాల్గొన్నారు. బంగారుపాళ్యం, వి.కోట, బైరెడ్డిపల్ల, రాయలపేట, కుప్పం, అంగళ్లు, మొలకల చెరువు, తంబళ్లపల్లి, పిటిఎం, పీలేరు, గుర్రంకొండ, రొంపిచర్ల, చిన్నగొట్టిగల్లు, బాకరా పేట, చంద్రగిరి, పేరూరు, తూకివాకం, రేణిగుంట, ఏర్పేడు, నారాయణవనం, కార్వేటినగరం, ఏర్పేడు, పిచ్చాటూరు, సత్యవేడు, నాగలాపురం, పాకాల, దామలచెరువు, కల్లూరు, వాయల్పాడు, గాజులమడ్యం, ఎలమడ్యం, కలకడ, సదుం, చౌడేపల్లి, అవిలాల, కాణిపాకం మొత్తం 35 మేజర్‌ పంచాయతీల్లో విజయవంతంగా సమ్మె ప్రారంభమయ్యింది.

వచ్చేదంతా పోరాటాల కాలం
Posted on: Tue 16 Dec 2014

 ఎపిలో ఎమర్జెన్సీ తరహా పాలన
-  సిఐటియు జాతీయ అధ్యక్షులు ఎకె పద్మనాభన్‌
ప్రజాశక్తి - కర్నూలు కార్పొరేషన్‌
           రానున్న ఏడాదంతా పోరాటాల కాలంగా పరిగణించాలని ఉద్యోగులకు, కార్మికులకు సిఐటియు జాతీయ అధ్యక్షులు ఎకె పద్మనాభన్‌ పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలో ఈ నెల 13 నుంచి ప్రారంభమైన సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాలు పేదలను, కార్మికులను పక్కన పెట్టి కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. బ్యాంకు, ఇన్సూరెన్స్‌, రైల్వే, బిఎస్‌ఎన్‌ఎల్‌, విద్యుత్‌ తదితర రంగాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిలోనూ సంస్కరణలు వేగవంతంగా అమలు చేస్తూ ఉద్యోగుల, కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు తెస్తున్నారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారని సిఐటియు నాయకులను, కార్యకర్తలను ఎలాంటి కారణమూ లేకుండానే అరెస్టు చేశారన్నారు. ఉద్యోగులు, కార్మికుల సమస్యల పట్ల చంద్రబాబు నాయుడు ఎమర్జెన్సీని తలపించేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన ఓటమిని గుణపాఠంగా తీసుకోవడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలోని సమస్యల కంటే సింగపూర్‌, జపాన్‌ ముఖ్యం కాదని చంద్రబాబు తెలుసుకోవాలన్నారు. మోడీ, బాబు అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను సిఐటియు అన్ని సంఘాలనూ కలుపుకుని పోరాటాలను ముమ్మరం చేస్తుందని తెలిపారు. అనంతరం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ మాట్లాడారు. సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌లో ఉద్యోగ కార్మికుల సమస్యలపై సమగ్రంగా చర్చించామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి చిరుద్యోగులను వేదించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
   రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఇసుక విధానంపై విజయవాడలో పెద్ద ఎత్తున ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్‌ రామకృష్ణ పాల్గొన్నారు.


రాజీలేని పోరు...
Posted on: Mon 15 Dec  2014
-  
కార్మికోద్యమాలకు దిశానిర్దేశం
-  ముగిసిన సిఐటియు జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాలు
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి
            కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ, ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను సమీకరించి రాజీలేని పోరాటాలను చేయాలని సిఐటియు పిలుపిచ్చింది. రాష్ట్ర విభజనానంతరం నవ్యాంధ్రప్రదేశ్‌కు సంబంధించిన సిఐటియు జనరల్‌ కౌన్సిల్‌ మొదటి సమావేశం ఘనంగా ముగిసింది. కర్నూలులో ఈనెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశం కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ పోరాటాలకు దిశా నిర్దేశం చేసింది. కేంద్రం లో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం పోటీపడి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పూర్వరంగంలో జరిగిన ఈ సమావేశాలు విజయవంతం కావడం పట్ల కార్మికవర్గం హర్షం వ్యక్తం చేస్తోంది. జనర ల్‌ కౌన్సిల్‌ ప్రారంభానికి వారం ముందు నుంచి కర్నూలు జిల్లావ్యాప్తంగా కార్మికులకు ఉత్సాహభరితమైన వాతావా రణం నెలకొంది. ప్రారంభం రోజున నిర్వహించిన ర్యాలీ, బహిరంగసభలకు పెద్ద ఎత్తున కార్మికవర్గం హాజరైంది. పదివేలమందికిపైగా కార్మికులతో కర్నూలు నగరంలో ప్రదర్శన, భారీ బహిరంగసభ నిర్వహించడం చర్చనీ యాంశమైంది. ఆ తర్వాత రెండు రోజుల సమావేశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను, కార్మికులు పడుతున్న ఇబ్బందులను సమగ్రంగా చర్చించి ఉద్యమానికి కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి రాగానే ఉపాధిని ప్రశ్నార్థకం చేయడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకం, ఐకెపి యానిమేటర్లు తమ సమస్యలను పరిష్కరించాలని అందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని సమావేశం తీవ్రంగా పరిగ ణించింది. ముఖ్యంగా చంద్రబాబు రాజస్థాన్‌ తరహా కార్మిక విధానాలను అమలు చేస్తామని చెప్పడం పట్ల సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ తరహా చట్టం రాష్ట్రంలో అమలైతే మొత్తం 90 శాతం మంది కార్మికులకు ఎలాంటి సాంఘిక భద్రత, ఉద్యోగ భద్రత ఉండదని సమావేశం అందోళన వ్యక్తం చేసింది.


కలిసి వస్తున్న కార్మిక సంఘాలు
Posted on: Mon 15 Dec 2014

 సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌లో
జాతీయ కార్యదర్శి డాక్టర్‌ హేమలత
ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్‌
          ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు చైతన్యమయ్యేంత వరకు పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోన్న ప్రభుత్వాలే మనుగడ సాగిస్తాయని సిఐటియు జాతీయ కార్యదర్శి డాక్టర్‌ హేమలత తెలిపారు. కర్నూలులో జరుగుతున్న సిఐటియు రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు రెండో రోజు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ పుణ్యవతి జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ హేమలత మాట్లాడారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కార్మిక చట్టాలు సవరణకు వ్యతిరేకంగా ఐఎన్‌టియుసి ఇతర కార్మిక సంఘాలు కలిసి రావటం మంచి పరిణామం అన్నారు.. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరించిన ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలకు విసుగెత్తిన ప్రజలు కాంగ్రెస్‌ను ఓడించి బిజెపి మేలు చేస్తుందని భావించి గెలిపించారన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ మాత్రం పట్టించుకోకుండా సంస్కరణలు చేస్తున్నారని విమర్శించారు. సిఐటియు కౌన్సిల్‌ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు.
      ఆర్థిక సంక్షోభంతో కార్మికులకు భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు. పాలకులు ప్రజలను  మతం పేరుతో విభజించాలని చూస్తున్న వైఖరి పట్ల అప్రమత్తత అవసరమని చెప్పారు.
కార్మికుల్లో ఘర్షణ పెట్టి తమ పనులు సజావుగా చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుందని తెలిపారు. కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సిఐటియు పనిచేసి ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. డిసెంబరు 31 దాటితే వచ్చే కొత్త విధానాలు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పరిస్థితి గాలిలో దీపంలా ఉందని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశాన్ని సిఐటియు ఆలిండియా అధ్యక్షులు ఎకె పద్మనాభన్‌ పర్యవేక్షించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌, ఉపాధ్యక్షులు బి రామాంజనేయులు, లక్ష్మయ్య, రోజా, కార్యదర్శులు అజరుకుమార్‌, ధనలక్షి, ఉమామ హేశ్వరరావులతోపాటు రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు పాల్గొన్నారు.

స్వచ్చంధ సంస్థలకు 'మధ్యాహ్న భోజనం'
Posted on: Mon 15 Dec 2014
-  
విద్యార్థులకు బయోమెట్రిక్‌
-  మంత్రి గంటా
ప్రజాశక్తి-గుంటూరు
             మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు జరుగుతుండడంతో ఆ పథకాన్ని ఇస్కాన్‌ వంటి స్వచ్చంధ సంస్థలకు ఇవ్వాలని యోచిస్తున్నట్లు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం గుంటూరులో జరిగే గ్రంథాలయ ఉద్యోగు ల రాష్ట్ర సదస్సుకు హాజరైన ఆయన జిల్లా పరిషత్‌ హాలులో జరిగిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. త్వరలో పాఠశాలల్లో ని విద్యార్థులకు కూడా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టను న్నట్లు చెప్పారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహా లు స్వీకరించటానికి ఒక వెబ్‌సైట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలో ఉన్న సృజనాత్మక తను వెలికి తీయటానికి ''ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌'' కార్యక్రమాన్ని బలోపే తం చేస్తామన్నారు. సోమవారం విజయ వాడలో 13 జిల్లాల విద్యాశాఖ అధికారులు, ఉద్యోగులతో జరగబోయే సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఉన్నత విద్యాసంస్థల్లో వసతులు, వాటి పనితీరుపై త్వరలో ఒక కమిటీ వేస్తున్నామ నీ, కమిటీ నివేదిక ఆధారంగా ఆయా విద్యాసంస్థలను ఎ, బి, సి కేటగిరీ లుగా విభజించి, బి కేటగిరీ విద్యా సంస్థలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటామ నీ చెప్పారు. అవసరమైతే సి కేటగిరి విద్యాసంస్థలను మూసివేస్తామన్నారు. పాఠశాలల్లో 8061 మరుగుదొడ్లు నిర్మిం చటానికి స్వచ్ఛంద సంస్థలు ముందు కొచ్చా యని, వచ్చే విద్యా సంవత్సరంలోపు వీటి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, ఎమ్మెల్యే కొమ్మా లపాట ిశ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.


యుటిఎఫ్‌ రాష్ట్ర నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఐ.వెంకటేశ్వ రరావు, పి.బాబురెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం 80 మందితో కొలువుదీరింది. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజులపాటు జరిగిన రాష్ట్రమహాసభల సందర్భంగా చివరిరోజు ఆదివారం రాష్ట్ర కమిటీ . ...


బీమా' బిల్లు ఆమోదిస్తే సమ్మె
Posted on: Sun 14 Dec  2014
-  
ఎఐఐఇఎ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.రమేష్‌
పజాశక్తి - అరసవల్లి/శ్రీకాకుళం
         బీమా చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో ఆమోదిస్తే సమ్మె చేపడతామని ఆలిండియా ఇన్స్యూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.రమేష్‌ తెలిపారు. శ్రీకాకుళం పట్టణంలో నిర్వహించిన యూనియన్‌ విశాఖ డివిజన్‌ 40వ వార్షిక మహాసభలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. సమ్మెతో బీమా రంగ ఉద్యోగుల నిరసన ఆగిపోదని, ఆఫీసు పని గంటల తర్వాత వివిధ రూపాల్లో తమ ఉద్యమం కొనసాగుతుందన్నారు. బీమా రంగంలోకి ఎఫ్‌డిఐలు రావడం వల్ల కలిగే నష్టాన్ని ప్రజలకు వివరిస్తామని తెలిపారు. ఇన్స్యూరెన్స్‌ రంగంలోని ప్రయివేట్‌ సంస్థల వద్ద కావాల్సిన పెట్టుబడులు లేవని, అందువల్లే ఎఫ్‌డిఐలను ఆహ్వానిస్తున్నామని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కోసం మోడీ ప్రభుత్వం ఒక్క పక్క వెంపర్లాడుతుంటే, గుజరాత్‌కి చెందిన పారిశ్రామికవేత్త అదానీ ఆస్ట్రేలియాలో, టాటా సింగపూర్‌లో పెట్టుబడులు పెడుతున్నారని పేర్కొన్నారు. ఇన్స్యూరెన్స్‌ ఉద్యోగుల వేతన సవరణ గడువు ముగిసినా ప్రభుత్వం ఆ అంశంపై మాట్లాడడం లేదన్నారు. సమావేశంలో సౌత్‌సెంట్రల్‌ జోన్‌ ఇన్స్యూరెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి క్లెమెంట్‌ జెవియర్‌ దాస్‌, ఐసిఇయు విశాఖపట్నం డివిజన్‌ అధ్యక్షులు బిబి.గణేష్‌ పాల్గొన్నారు.



కార్మిక వ్యతిరేక విధానాలకు ప్రతిఘటన
Posted on: Sun 14 Dec  2014

చావో...బతుకో...తేల్చుకోవాలి...
- సిఐటియు జాతీయ అధ్యక్షులు ఎకె పద్మనాభన్‌
(ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి)
         కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయబోతున్న కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలను కార్మికులంతా ఏకమై ప్రతిఘటించాల్సిన సమయం ఆసన్నమైదని.సిఐటియు జాతీయ అధ్యక్షులు ఎకె పద్మనాభన్‌ ఉద్ఘాటించారు. మూడు రోజుల సిఐటియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా తొలిరోజు కర్నూలు నగరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ''నెంబర్‌ వన్‌ కూలీని... ఛారు వాలాను.. నన్ను గెలిపిస్తే మీకు సేవ చేసుకుంటాను'' అని ఊరూరా తిరిగి ఎన్నికలకు ముందు చెప్పి ఓట్లేయించుకున్న మోడి అధికారంలోకి రాగానే సామాన్యులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. మోడి గద్దెనెక్కాక ఉద్యోగ, కార్మిక హక్కులపై దాడులకు పూనుకున్నారని విమర్శించారు. ఈ దశలో కార్మికవర్గం సంఘటితంగా ప్రజలను సమీకరించి 'చావో...బతుకో...' అన్న రీతిలో ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. తనకు అవకాశం కల్పిస్తే సేవ చేసుకుంటానని ఊరూరా తిరిగి ప్రచారం చేసిన మోడిని నమ్మి ప్రజలు ఓట్లు వేశారని చెప్పారు. నరేంద్రమోడి గద్దెనెక్కినప్పటి నుంచి సామాన్యులను విస్మరించి, ధనవంతులకు, పెట్టుబడిదారులకు ఎలా సేవ చేయాలో అని తపిస్తున్నారన్నారు. భీమా బిల్లు ద్వారా 26 శాతం నుంచి 49 శాతానికి విదేశీ పెట్టుబడులను అనుమతించేలా సవరణలు తెస్తున్నారని తెలిపారు. 2008లో యుపిఎ ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ రంగాన్ని నిర్వీర్యం చేసే ఈ బిల్లును పెట్టాలని చూస్తే ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు, వామపక్షాలు పెద్దఎత్తున ప్రతిఘటించడంతో ఉపసంహరించు కుందని చెప్పారు. నరేంద్రమోడి ప్రభుత్వం మళ్లీ ఆ బిల్లును ముందుకు తెచ్చిందని, దీనిని అడ్డుకోవాలని సూచించారు.
                 సిఐటియు జాతీయ కార్యదర్శి డాక్టరు హేమలత మాట్లాడారు. నరేంద్రమోడి ఎన్నికలకు ముందు అరచేతిలో స్వర్గం చూపించారని విమర్శించారు. దేశవ్యాప్తంగా పిల్లలకు, తల్లులకు పౌష్టికాహారం అందించే ఐసిడిఎస్‌కు నిధులు ఇచ్చేందుకు డబ్బుల్లేవంటున్న నరేంద్రమోడి అంబాని, అదాని లాంటి బడాపెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయలు రాయితీలివ్వడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ మాట్లాడుతూ. కార్మికులను బానిసలుగా మార్చే చట్టాలను తీసుకురావాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఉన్న ఉద్యోగాలను తొలగించడంతోపాటు స్కీం వర్కర్లకు వేతనాలు ఇవ్వ కుండా మొండికేస్తున్నారని చెప్పారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు బి.రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో ఎపి పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి, బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల సంఘం అఖిల భారత ఉపాధ్యక్షులు అశోక్‌బాబు, ఐసిఇ యు కడప డివిజనల్‌ ప్రధాన కార్యదర్శి సుభశేఖర్‌, సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎస్‌ రాధాకృష్ణ, నగర నాయకులు గౌస్‌ దేశారు, నాగరాజు తదితరులు మాట్లాడారు.

గంగవరం' కార్మికుల ధర్నా
Posted on: Sat 13 Dec 2014
  
ప్రజాశక్తి - కలెక్టరేట్‌, విశాఖపట్నం
   తమ వేతనాలను, బోనస్‌ను పెంచాలని, యూనియన్‌ నాయకులపై కక్షపూరిత చర్యలను మానుకోవాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ అఖిల పక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన కలెక్టరేట్‌ ఎదుట గంగవరం పోర్టు కార్మికులు శుక్రవారం ధర్నా నిర్వహించారు.
సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు పి వెంకటరెడ్డి, బి.జగన్‌, కోశాధికారి జ్యోతీశ్వరరావు, బిల్డింగ్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేశ్వరరావు, పబ్లిక్‌ సెక్టార్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ నాయకులు కుమారమంగళం, షిప్‌యార్డు యూనియన్‌ నాయకులు సూర్యచంద్రరావు తదితరులు నాయకత్వం వహించారు. పోర్టు యాజమాన్యం కార్మిక సంఘ నేతలపై వేధింపులకు దిగుతోందని విమర్శించారు. కోట్లాది రూపాయల లాభాలను ఆర్జిస్తూ కార్మికులకు రూ.3500 మాత్రమే బోనస్‌ చెల్లించడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు.
యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు భూలోకరావు, అప్పారావులను ఉద్యోగం నుంచి తొలగించడం దారుణమన్నారు. అనంతరం 15 డిమాండ్లతో కూడిన వినపత్రాన్నికలెక్టర్‌ ఎన్‌.యువరాజ్‌కు అందజేశారు.


వామపక్ష నేతలు, 'అరబిందో' కార్మికుల అరెస్టు
Posted on: Thu 11 Dec 01:20:03.599961 2014
-   

ఐదు గంటల పాటు సిపిఐ కార్యాలయంలో నిర్బంధం
ప్రజాశక్తి - అరసవల్లి/శ్రీకాకుళం
               అరబిందో ఫార్మా కార్మికుల ఆందోళనలకు మద్దతుగా పది వామపక్షాలు శ్రీకాకుళంలో బుధవారం తలపెట్టిన సంఘీభావ ప్రదర్శన, సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ క్రాంతి భవన్‌లో వామపక్ష నాయకులను పోలీసులు నిర్బంధించారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పది మంది వామపక్ష నాయకులతోపాటు మొత్తం 20 మందిని అరెస్టు చేసి శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఉన్నారు. సభకు అనుమతి నిరాకరణతో వామపక్ష నాయకులు సిపిఐ కార్యాలయమైన క్రాంతి భవన్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సిద్ధమవుతుండగానే పోలీసులు క్రాంతి భవన్‌లోకి చొరబడి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చాపర వెంకటరమణను అరెస్టు చేశారు. సమావేశం అనంతరం మరోమారు వామపక్ష, కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసేందుకు యత్నించగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అక్కడకు చేరుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కలెక్టర్‌ను కలిసేందుకు నాయకులతో ప్రదర్శనగా వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు జెవి.చలపతిరావు, సిపిఐ (ఎంఎల్‌) రాష్ట్ర నాయకులు గుర్రం విజరుకుమార్‌, సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు టి.సన్యాసిరావు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి పివి.సుందరరామరాజు, ఎంసిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.నానాజీరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్‌తోపాటు పలువురు ఉన్నారు. ఆందోళనలో పాల్గొనడానికొచ్చిన కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఆర్‌టిసి బస్సులను ఆపి తనిఖీలు చేసి కార్మికులను ఎక్కడికక్కడే దించేశారు. కార్మికులు కాని వారిని కూడా బస్సుల్లోనుంచి దించేయడంపై ప్రయాణికులనుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.
అరెస్టులకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన కార్మికుల అరెస్టు
             వామపక్ష నేతల అరెస్టు విషయం తెలుసుకున్న అరబిందో ఫార్మా కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. వందలాది మంది శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌నుంచి డే అండ్‌ నైట్‌ కూడలి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి, జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది.కార్మికులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అక్రమ అరెస్టుకు సిపిఎం, సిఐటియు ఖండన
      అక్రమ అరెస్టులను సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, సిఐటియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుపతిరావు, డి.గోవిందరావు ఖండించారు.