1, జులై 2016, శుక్రవారం

భారత్‌కు అణు విద్యుత్‌ అవసరమా?

  1. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యుదుత్పత్తి పెంచాలని, అందులోనూ అణు విద్యుత్‌ అయితే మన దేశీయ అవసరాలు సునాయాశంగా తీరతాయంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రచారం వింటుంటే ఆశ్చర్యం కలగకమానదు! ప్రపంచంలో అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్‌ది ఐదో స్థానం. దేశంలో విద్యుత్‌ ఉత్పత్తికి, వినియోగానికి మధ్య తేడా కేవలం 12 శాతం మాత్రమే అన్నది వాస్తవం! ఈ లోటు భర్తీ చేయాలంటే అణు విద్యుత్‌ ఉత్పత్తి చేయడమే పరిష్కారమని, అమెరికా అణు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడమే శరణ్యమని పాలకులు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం! 2012లో అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నప్పుడే ఈ ప్రమాదాన్ని వామపక్షాలు దేశానికి తెలియజేశాయి. కానీ అప్పటి అధికార, ప్రతిపక్షాలు దాన్ని కొట్టిపారేశాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? 
  2. అమెరికా అణు పరిజ్ఞానం, రియాక్టర్లు శ్రేయష్కరమా?
  3. అమెరికా అణు సాంకేతిక పరిజ్ఞానం అత్యంత ప్రమాదకరమైంది, ఖరీదైనదని ఇప్పటికే రుజువైంది. 1968 నుంచి 2011 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 101 అణు విద్యుత్‌ కేంద్రాల ప్రమాదాలు జరిగాయి. ఆశ్చర్యకమైన విషయమేమంటే వాటిలో 57 ప్రమాదాలు అమెరికాలో జరిగాయంటే అమెరికా అణు పరిజ్ఞానం, అణు రియాక్టర్లు ఎంత శ్రేయష్కరమో అర్థమవుతుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించే అమెరికా తన విద్యుత్‌ కేంద్రాలను మూసేసింది. తాను మూలపడేసిన అణు రియాక్టర్లను భారత్‌కు అంటగడుతున్నది. ఈ వాస్తవాన్ని గమనించకుండా అమెరికాతో అణు బంధానికి భారత్‌ పాలకులు ఆరాటపడటం ఎందుకోసం, ఎవరికోసం? ఈ రియాక్టర్ల కొనుగోలు వల్ల అమెరికా ఆర్థికంగా లాభపడుతుంది. అంతేకాక దీర్ఘకాలం భారతదేశ ఆర్థిక, రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. మన నేతలకు కమీషన్ల రూపంలో కోట్ల రూపాయల ముడుపులు అందుతాయి తప్ప ప్రజానీకానికి ఎలాంటి ఉపయోగమూ లేదన్నది వాస్తవం.
  4. ప్రత్యామ్నాయం లేదా?
  5. ప్రస్తుతం మన దేశంలో ఏడాదికి 3,01,965 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది. అందులో థర్మల్‌ విద్యుత్‌ 2,10,675 మెగావాట్లు (మొత్తం విద్యుదుత్పత్తిలో 69.76 శాతం) జల విద్యుత్‌ 42,783 మెగావాట్లు (14.16 శాతం), సాంప్రదాయేతర విద్యుత్‌(గాలి, సూర్యరశ్మి, వ్యర్థాల ద్వారా) 42,727 మెగావాట్లు (14.16 శాతం), అణు విద్యుత్‌ 5,780 మెగావాట్లు (1.91 శాతం). నేటికీ థర్మల్‌ విద్యుత్‌దే సింహభాగం. కానీ 2012లో అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్న అనంతరం మన ప్రభుత్వాలు తమ విద్యుదుత్పత్తి లక్ష్యాలు మార్చుకున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 21 అణు విద్యుత్‌ కేంద్రాల ద్వారా మొత్తం విద్యుదుత్పత్తిలో కేవలం 1.91 శాతం అణు విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండగా అమెరికాతో అణు ఒప్పందం ఫలితంగా ఇంకో 45 అణు విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగమే కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం. 2032 నాటికి 63గిగా వాట్ల అణు విద్యుత్‌ ఉత్పత్తి చేయాలని, 2050 నాటికి దేశంలో ఉత్పత్తయిన విద్యుత్‌లో 25 శాతం అణు విద్యుత్తే ఉండాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. సహజ వనరులకు నిలయమైన భారతదేశంలో విద్యుదుత్పత్తికి అనేక మార్గాలుండగా అణు విద్యుత్‌పై ఆధారపడటం ఆత్మహత్యా సదృశమే! నేటికీ ప్రపంచంలో అత్యధిక బొగ్గు నిల్వలున్న దేశాల్లో భారత్‌ ఒకటి. 2014-15 ఇండియన్‌ ఎనర్జీ స్టేటస్టిక్స్‌ నివేదిక ప్రకారం దేశంలో 301.05 బిలియన్‌ టన్నుల బొగ్గు, 1,427.15 బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌, 762.74 మిలియన్‌ టన్నుల ముడి చమురు, 43.24 బిలియన్‌ టన్నుల లైనేట్‌ ఖనిజ నిల్వలున్నాయి. ఇవి కాక సహజ వనరులైన గాలి, నీరు, ఏడాదిలో 300 రోజులు సూర్యరశ్మి లభించే వాతావరణం ఉన్న సమశీతోష్ణ స్థితి కలిగిన దేశం మనది. నేటికీ జల విద్యుత్‌ ఉత్పత్తికి ఉన్న అవకాశాలు 84 వేల మెగావాట్లు. కానీ ప్రస్తుతం 42,783 మెగావాట్ల జల విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. అంటే పూర్తిస్థాయిలో జల విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటే మనకున్న 12 శాతం విద్యుత్‌ కొరతను సునాయాశంగా అధిగమించొచ్చు. వీటితోపాటు పైన తెలిపిన సహజ వనరులను విద్యుదుత్పత్తికి వినియోగిస్తే ప్రమాదకరమైన, అత్యంత ఖరీదైన అణు విద్యుత్‌ను ఉత్పత్తిచేసే అవసరమే లేదన్నది విద్యుత్‌ రంగ నిపుణుల అభిప్రాయం. దేశీయ సహజ వనరుల ద్వారా యూనిట్‌ విద్యుత్‌ను కేవలం ఒక్క రూపాయికే ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉండగా యూనిట్‌ పది రూపాయల ఖరీదైన అణు విద్యుత్‌ కోసం పాకులాడటం పాలకుల నీచత్వానికి నిదర్శనం.
  6. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అణు ప్రమాదాలు తీవ్ర ప్రభావం చూపాయి. బెల్జియం, జపాన్‌, జర్మనీతో సహా 48 దేశాలు పూర్తిగా అణు విద్యుత్‌ ఉత్పత్తినే నిలుపుదల చేసుకున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. చెర్నోబిల్‌ లాంటి పరిస్థితి కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రంలో సంభవిస్తే తట్టుకునే యంత్రాంగం మనకుందా? సాంకేతికంగా అభివృద్ధి చెందిన జపాన్‌ ఫుకుషిమా ప్రమాదం తరువాత అణు విద్యుత్‌ కేంద్రాన్ని తెరిపించేందుకు నేటికీ సాహసించలేదంటే అణు ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ఫుకుషిమా అణు ప్రమాదం తరువాత ఇండియన్‌ ఆటామిక్‌ రెగ్యులేటరీ బోర్డు అధికారులు 2011 ఆగస్టులో భారత్‌ అణు విద్యుత్‌ కేంద్రాల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా తమిళనాడు, తారాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రాలకు విపత్తును తట్టుకునే స్థాయిలేదని, సాంకేతిక పరిజ్ఞానాన్ని అప్‌గ్రేడ్‌చేసి రక్షణ చర్యలు చేపట్టమని సూచించినా నేటికీ ప్రభుత్వం చేయలేదంటే మన పాలకులకు ప్రజల ప్రాణాలపై ఉండే గౌరవం ఎంతో అర్థమవుతుంది. ఉన్న అణు విద్యుత్‌ కేంద్రాల్లోనే రక్షణ చర్యలు తీసుకోలేని ప్రభుత్వం కొత్తగా ప్రారంభించబోతున్న కొవ్వాడ వంటి అణు విద్యుత్‌ కేంద్రాలకు పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకుంటుందని ఎలా నమ్మగలం? ఇలాంటి అనుమానాల వల్ల ప్రజలు అణు విద్యుత్‌ కేంద్రాలను వ్యతిరేకిస్తున్నారన్నది వాస్తవం. ఇలాంటి వాస్తవాలు మన కళ్ల ముందే కన్పిస్తున్నా మన పాలకులు అణు విద్యుత్‌ జపం మానకపోవడం విచారకరం.
  7. సోలార్‌ గుజరాత్‌కు.. అణు ఆంధ్రాకా?
  8. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన పాలకులు సామాజిక న్యాయ సూత్రాన్ని పాటించాలి. కానీ కేంద్రంలో బిజెపి రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తుందనడం వాస్తవం. దేశంలోనే సౌర విద్యుత్‌ అధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం గుజరాత్‌. కేంద్రంలో బిజెపి అధికారం చేపట్టిన తరువాత సౌర విద్యుత్‌ పరిశ్రమలను గుజరాత్‌లో విరివిగా నెలకొల్పింది. 2007లో గుజరాత్‌లోని మితివర్థిలో నెలకొల్పాల్సిన అణు విద్యుత్‌ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వాడకు తరలించారు. సురక్షితమైన విద్యుత్‌ గుజరాత్‌కు.. ప్రమాదకరమైన అణు విద్యుత్‌ ఆంధ్రప్రదేశ్‌కా..? ఇదేమి న్యాయం? కేంద్రం చేస్తున్న కుట్రలో రాష్ట్ర ప్రభుత్వానికీ భాగముంది. కొవ్వాడ అణు విద్యుత్‌ కేంద్రం ప్రతిపాదనను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించిన టిడిపి ఇప్పుడు సమర్థించడంలో ఆంతర్యమేమిటి? అణు విద్యుత్‌ కేంద్రాన్ని వ్యతిరేకిస్తున్న వారందరినీ అభివృద్ధి నిరోధకులని దుష్ప్రచారం చేయడం మరీ విడ్డూరంగా ఉంది. పరిశ్రమల పేరున వేలాది ఎకరాల భూముల నుంచి లక్షలాది మందిని తొలగిస్తే కచ్చితంగా ప్రతిఘటిస్తారు. తన జీవనం నాశనం చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఇప్పటికే విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో నిర్మించిన ఫార్మా కంపెనీలను ఎవరూ అడ్డుకోలేదు. కాశీబుగ్గ, పలాస ప్రాంతాల్లో వందల జీడి పరిశ్రమలు వస్తే ప్రజలు స్వాగతించారు తప్ప వ్యతిరేకించలేదు. విజయనగరం జిల్లాలో నెలకొల్పిన ఫెర్రోఎల్లాయిస్‌, జ్యూట్‌ పరిశ్రమను ఎవరూ వద్దనలేదు. కానీ పాలకుల విధానాల వల్ల ఉన్న పరిశ్రమలు మూతబడి లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. దీని గురించి కనీసం అధికార పక్షం మాట్లాడి ఉపాధి పునరుద్ధరణకు చర్యలు తీసుకోలేదు. ఉన్న పరిశ్రమలు మూతబడి కొత్తగా వచ్చే పరిశ్రమలు ప్రజల జీవితాలను నాశనం చేస్తే ప్రజలు ఎందుకు వ్యతిరేకించరు?
  9. - బొత్స వెంకటరమణ (వ్యాసకర్త సిఐటియు విజయగనరం జిల్లా ఉపాధ్యక్షులు)
  10. 9440363968

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి