30, అక్టోబర్ 2011, ఆదివారం

కుభేరులు-అన్నార్తులు

ప్రపంచంలోనే శీఘ్రంగా అభివృద్ధి చెందుతున్న కొద్ది దేశాల్లో ఒకటిగా ప్రశంసలందుకుంటున్న భారత దేశంలో అంతే మోతాదులో పేదరికం, దారిద్య్రం, ఆకలి కేకలూ పెరుగుతుండడం పెట్టుబడిదారీ అభివృద్ధి వికృత రూపాన్ని వెల్లడిస్తోంది. కొద్ది వారాల క్రితమే ఫోర్బ్స్‌ పత్రిక వెల్లడించిన ప్రపంచ కుబేరుల సరికొత్త జాబితాలో భారతీయ కుబేరుల సంఖ్య 24 నుండి అమాంతం 52కు పెరిగింది. ఏడాదిలో 100 శాతం పైగా కుబేరులు పెరిగారన్న వార్త వెనువెంటనే మన దేశం మానవాభివృద్ధి సూచిలో 126 స్థానం నుండి 134 స్థానానికి దిగజారిందన్న విషయం కూడా వెల్లడైంది. 2004లో మన దేశంలో శతకోటీశ్వరులు (వందకోట్ల డాలర్లకు పైగా ఆస్థి ఉన్నవారు లేక కనీసం 5000 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఉన్న వారు) 9 మంది కాగా వారి సంఖ్య ఆరేళ్ల కాలంలో ఆరు రెట్లు పెరిగింది. కాని ఇదే కాలంలో నిష్ట దరిద్రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికార నివేదికలే తెలియజేస్తున్నాయి. 2009-మానవాభివృద్ధి నివేదిక ప్రపంచంలోని మొత్తం 184 దేశాల జాబితా ప్రకటించగా వాటిలో భారత్‌ 134వ స్థానంలో ఉంది. అంతకు ముందుటేడాది 126 స్థానంలో ఉండేది కాస్తా మరింత దిగజారింది. దేశాభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న పాలకులూ, పాలక వర్గ మీడియా... ఎందుకు మన దేశంలో ఈ అభివృద్ధి మధ్యలోనే పేదరికం ఇంతగా పెరగుతున్నదో ఎన్నడూ చర్చకు పెట్టవు. దేశంలో నూటికి 80 శాతం ప్రజలు నేటికీ రోజుకు 20 రూపాయల ఆదాయంతో బ్రతుకీడుస్తున్నారని గతేడాది కార్మిక శాఖ జరిపిన సర్వేలో తేలింది. చివరికి మనం దేశంలో పేదరికం అంచనాలను అతి తక్కువగా చేసిచూపుతున్న ప్రణాళికా సంఘం కూడా తప్పు సవరించుకుని పేదరికం లెక్కలను కొంతమేరకైన పెంచి చూపించాల్సిన అగత్యం ఏర్పడింది. భారతీయ కుభేరులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతుంటే మరోవైపు పేదరికంలో మన దేశం ప్రపంచలోనే అత్యం నిరుపేద ప్రాంతమైన సహారా దిగువ దేశాలతో పోటీ పడుతోంది. దేశంలో జరుగుతున్న ఈ రకమైన వికృత అభివృద్ధికి ప్రభుత్వ విధానాలే కారణమన్నది సుస్పష్టం. నేల, నీరు, గనులు, ప్రజా సంపద మొత్తం బడాబాబులకు అప్పనంగా కట్టబెడున్న ప్రభుత్వ విధానాలు, శ్రామికుల శ్రమశక్తిని దోపిడీ చేసుకోడానికి సంపన్నులకు నిర్నిరోధమైన అవకాశాలు కల్పిస్తున్న విధానాలు, హక్కుల కోసం పోరాడే శ్రామిక జన ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వం...అదే ప్రభుత్వం మరోవైపు పేద, సామాన్య ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతోంది. వారి నిజవేతనాలకూ, ఉద్యోగభద్రతకూ కోతపెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్టూ ధనికులకు మరిన్ని రాయితీలు ఇస్తున్నాయి, పేదలకు ఇచ్చే సబ్సిడీలు, సంక్షేమ కార్యక్రమాలకు కోతపెడుతున్నాయి. ఈ విధానాలను ఇలా కొనసాగనిస్తే అభివృద్ధి బాగానే ఉంటుంది, కుభేరుల సంఖ్య ఇంకా పెరుగుతుంది, కాని పేద, సామాన్య ప్రజల బ్రతుకులు మాత్రం మరింత దుర్భరమవుతాయి. అసమానతలు మరింత తీవ్రమవుతాయి. సంక్షోభం మరింత ముదురుతుంది. ప్రజా పోరాటాలు మాత్రమే ఈ దుష్పరిణామాలకు అడ్డుకట్ట వేయగలవు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి