13, జులై 2012, శుక్రవారం



నిత్యావసర సరుకుల ధరలు అరికట్టాలి నిత్యావసర సరుకుల ధర పెరుగుదలకు ప్రభుత్వం చేసే వాదనలు మోసపూరితమైనవి:
ఒకటి: రైతుకొచ్చే మద్దతు ధరలు పెరుగుతున్నందునే ధరలు పెరుగుతున్నాయని ప్రభుత్వం వాదించడంలో వాస్తవం లేదు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకారం కిలో వరి 2011లో 10రూ.80 పైసలు. మరి కిలో బియ్యం బహిరంగ మార్కెట్‌లో 24 రూ.లకి తక్కువగా ఎక్కడా ఎందుకు దొరకటం లేదు?
రెండు: ప్రజల ఆదాయాలు పెరిగి జేబుల్లో డబ్బు ఎక్కువై ధరలు పెరుగుతున్నాయని మరోవాదన.
అసలు కారణాలు
ప్రభుత్వ వాదన నిజమయితే 2005-06లో 8.6 శాతంగా వున్న వినిమయ ఖర్చు 2010-11లో 7.3 శాతానికి ఎందుకు పడిపోయింది. ప్రభుత్వం నియమించిన అర్జున్‌సేన్‌ గుప్తా నివేదిక ప్రకారం ఈ దేశంలో నూటికి 77 మందికి రోజుకి రూ. 20లోపు మాత్రమే వస్తుంది. మరిక జేబులో డబ్బు ఎక్కువైంది ఎక్కడీ మొత్తం కార్మిక వర్గంలో నూటికి51 మంది స్వయంఉపాధి కార్మికులు, 33.5 మంది క్యాజువల్‌ 15.6 మంది వేతన కార్మికులు వీరిలో మళ్లీ అత్యధికులు కాంట్రాక్టు కార్మికులు. వీరి జేబుల్లో డబ్బులు ఎలా గలగల్లాడతాయి?
1. సరుకు దాచివేత 2) భవిష్యత్‌ లాభాలను ఆశించి చేసే స్పెక్యులేటివ్‌ వ్యాపారం 3) తప్పుడు ఎగుమతి విధానం. 4. ఆహార వ్యాపారంలోకి కార్పొరేట్‌ దిగ్గజాల చొరబాటు. 5. ఎరువులు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు ప్రభుత్వం పెంచటం 6) వడ్డీరేట్లు పెంచిన ప్రభుత్వం 7) ప్రధాన ఆహార పంటలు డిమాండ్‌కు తగ్గట్టుగా పండకపోవటం 8) రూపాయి విలువ పడిపోవటం.
డిమాండ్స్‌: ధరలు పెరుగుదలకు దారితీసే ప్రభుత్వ విధానాలు మారాలి. స్పెక్యులేటివ్‌ వ్యాపారాన్ని నిషేధించాలి-గోడౌన్లలోవున్న స్టాకును విడుదలచేసి చౌక ధరలకు విక్రయించాలి. ప్రజాపంపిణీ వ్యవస్థను సార్వత్రీకరించాలి. పెట్రోలియం ఉత్పత్తులపై వేస్తున్న లక్షా30 వేల కోట్ల రూపాయల పన్నులను తీవ్రంగా తగ్గించాలి. విదేశీ ఫైనాన్స్‌ పెట్టుబడులపై ఆధారపడటం మానుకోవాలి.
ఉద్యోగ భద్రత కల్పించాలి
ఆర్థిక సంక్షోభం పేరుతో ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు ఉద్దీపనా పథకం క్రింద ఇచ్చింది. రూ.2 లక్షల కోట్లు. మూడు సంవత్సరాల్లో కార్పొరేట్‌ సంస్థలకు ఇచ్చిన పన్ను రాయితీలు రూ.14 లక్షల కోట్లు
అయినా ఉపాధి పెరుగుదల రేటు 2.7 శాతం నుండి 0.8. శాతానికి పడిపోయింది. ప్రజల డబ్బుతో జేబులు నింపుకున్న కంపెనీలు లక్షలాది మంది కార్మికులను సంక్షోభం పేరుతో తొలగించాయి. కనీస వేతనాలు, పి.ఎప్‌. ఇ.ఎస్‌ఐలను ప్రయివేటు కంపెనీలు చెల్లించవు. ప్రభుత్వ మరియు కార్పొరేట్‌ శక్తుల దోపిడీని అరికట్టి కార్మికులకు ఉపాధి ఉద్యోగ భద్రత కల్పించాలి.
అసంఘటిత కార్మికులందరికి సామాజిక భద్రత కల్పించాలి
స్థూల జాతీయోత్పత్తిలో 60 శాతం వాటా అందిస్తూ 93 శాతంగా వున్న అసంఘటిత కార్మికులకు దక్కుతున్నదేమిటి? పని గంటలు, కనీస వేతనాలు, ఆసుపత్రి సౌకర్యం, ప్రమాద భీమా సౌకర్యం పి.ఎప్‌, పెన్షన్‌ ఏమీలేవు.
అత్యధిక శాతం మంది కార్మిక చట్టం పరిధిలోకేరారు. వీటన్నిటిని కల్పిస్తూ చట్టం చేయాలని అషిస్‌సేన్‌ గుప్తా కమిటీ చేసిన సిఫార్సులను ప్రభుత్వం తుంగలో తొక్కింది.
పోరాడగా, పోరాడగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టం అసంఘటిత కార్మికుల్ని మోసం చేసేదిగా వుంది. అదొక పేపరు పులిలాంటిది. కనీస వేతనం , పని గంటలు ఉద్యోగ భద్రత, జీవిత బీమా, ప్రమాద బీమా, ఆరోగ్యం, ప్రసూతి సౌకర్య, పెన్షను సౌకర్యాలను ఎటువంటి మినహాయింపులు లేకుండా అసంఘటిత కార్మికులందరికీ కల్పించాలి. అందుకు అవసరమైన మార్పులను చట్టంలో చేయాలి. దీనికయ్యే మొత్తం ఖర్చును కేంద్రప్రభుత్వమే బడ్జెట్‌ నుండి కేటాయించాలి.
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని నిలిపేయాలి:
దేశ, విదేశీ పెట్టుబడిదార్లకు ప్రభుత్వరంగాన్ని దశల వారీగా ఒప్పగించటాన్ని నిలిపివేయాలి. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచటానికి వాటాల విక్రయం చేస్తున్నా మన్న ప్రభుత్వ వాదన వాస్తవమా? ఇప్పటి వరకు జరిగిన ప్రయివేటీకరణలో ప్రజల చేతుల్లోకి పోయింది ఒక శాతం మాత్రమే. మిగతా మొత్తం భాగాన్ని కార్పొరేట్‌ కంపెనీలు, బహుళజాతి గుత్త కంపెనీలు, ప్రయివేటు మ్యూచువల్‌ ఫండ్స్‌ హస్తగతం చేసుకున్నాయి.
ప్రభుత్వ రంగ సంస్థల ఆధునీకరణ కోసం వాటాలు విక్రయిస్తున్నామని ప్రభుత్వం మరో తప్పుడు వాదన చేస్తోంది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల వద్ద రూ. ఐదు లక్షల కోట్ల పైగా ఉన్న నగదు నిల్వలు వాటి ఆధునీకరణకు పనికిరావా? విస్తరణకు పనికిరావా? సంక్షేమరంగ ఖర్చుల కోసం వాటాలు విక్రయిస్తున్నామని ప్రభుత్వం చెప్పటాన్ని కూడా ఆమోదించకూడదు. సంక్షేమ సౌకర్యాలు కల్పించటం ప్రభుత్వాల బాధ్యత. ఆ పేరుతో మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రయివేట్‌ వారి చేతుల్లో పెట్టటాన్ని అమోదించకూడదు.
శాశ్వత పనుల్లో కాంట్రాక్టీకరణ ఉండకూడదు. పర్మినెంట్‌ పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంట్‌ వర్కర్ల వేతనాలు, బెనిఫిట్లు ఇవ్వాలి.
కార్మికులను దోపిడీ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హద్దుల్లేవు. పర్మినెంట్‌ కార్మికులు చేస్తున్న పనిని చేయించుకుంటూ వారికి కాంట్రాక్టు కార్మికులనే పేరుతో అతితక్కువ వేతనాలిచ్చి, ఎటువంటి సామాజిక భద్రత లేకుండా దోపిడీ చేసేందుకు ప్రభుత్వం నిస్సిగ్గుగా అనుమతిస్తున్నది.
10 వేల రూపాయల కనీస వేతనం ఇవ్వాలి.
15వ లేబరు కాన్ఫరెన్సు సిఫార్సుల ప్రకారం ప్రస్తుతం ఉన్న ధరలలో 2700 క్యాలరీల ఆహారం, ఇంటి అద్దె, బట్టలు, ఇంధన ఖర్చులు, పిల్లల చదువులు, రవాణా ఖర్చులు భరించాలంటే కనీసం 10 వేల రూపాయల వేతనం వుండాలి. దాని మీద వి.డి.ఏ ఇవ్వాలి. షెడ్యూల్స్‌తో నిమిత్తం లేకుండా కార్మికులందరికీ ఈ వేతనం వర్తింప జేయాలి. గౌరవ వేతనం ప్రోత్సాహకాలు, పారితోషికాల పేర్లతో పని చేస్తున్న వారందరికీ ఈ వేతనం ఇవ్వాలి.
కనీస వేతనాలు ఇస్తే పరిశ్రమలు నడవవని యజమానులు చేస్తున్న వాదన పచ్చి అబద్ధం. ఉత్పత్తిలో అదనంగా చేరుతున్న విలువలో వేతనం వాటా 2001లో 30 శాతం నుండి 2009లో 9.5 శాతానికి పడిపోయింది. ఇదే సమయంలో అదనంగా చేరుతున్న విలువలో వేతనం వాటా లాభాల శాతం 15 నుండి 55కు పెరిగింది. కార్మికుల శమ్రను యజమానులు కొల్లగొట్టటాన్ని ఇంకెంత మాత్రం అనుమతించకూడదు.
పి.ఎఫ్‌ బోనస్‌ల మీద సీలింగులు ఎత్తివేయాలి. గ్రాట్యుటీని పెంచాలి:
65 సంవత్సరాల స్వతంత్ర భారత దేశంలో ఇప్పటికీ అత్యధిక కార్మికులకి పి.ఎప్‌,బోనస్‌, గ్రాట్యుటీలు అంటే ఏమిటో, అవి ఎలా ఉంటాయో తెలియదు. అవి వర్తించే కార్మికులు, ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అనేక పరిమితులు విధించింది. ఇ.పి.ఎఫ్‌ చట్టం వర్తించే కార్మికులకు 6500 వేతనం వరకే పి.ఎఫ్‌ను పరిమితం చేశారు. ఫలితంగా ఇ.పి.ఎఫ్‌్‌ పెన్షన్‌ కూడా చాలా తక్కువ వస్తుంది. 10 వేల రూపాయల వేతనం దాటితో బోనస్‌ లేదు. 10 వేలు, ఆలోపు వేతనం వచ్చే కార్మికులకు కూడా వేతనాన్ని 3,500 గానే లెక్కలోకి తీసుకొని బోనస్‌ ఇస్తున్నారు.గ్రాట్యూటి మీద కూడా సీలింగు పెట్టారు.
అందరికీ గ్యారంటీతో కూడిన పెన్షన్‌ ఇవ్వాలి.
కార్మికులకు ఉద్యోగులకు వున్న పెన్షన్‌ హక్కులను పాతిపెట్టేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది. ఆ కుట్రలో భాగమే పార్లమెంటులో ప్రవేశపెట్టిన పెన్షన్‌ బిల్లు. ఈ కుట్రలో యుపిఏ ప్రభుత్వానికి బిజెపి సహ భాగస్వామిగా ఉంది.
1995లో ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ఇ.పి.ఎఫ్‌ఒక ఫార్సు స్కీముగా మారింది. అప్పుడు వాగ్దానం చేసిన అనేక సౌకర్యాలు ఇప్పటికే కత్తిరించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వస్తున్న పెన్షన్‌ స్థానంలో కొత్త పెన్షన్‌ స్కీం వచ్చింది. ఇందులో పెన్షన్‌ కోసం ఉద్యోగులు డబ్బులు కట్టుకున్నా పెన్షన్‌ వస్తుందన్న గ్యారంటీ లేదు. అసంఘటిత కార్మికులను కూడా స్వావలంబన పేరుతో కొత్త పెన్షన్‌ పథకానికి డబ్బులు కట్టేలా గాలం వేస్తున్నారు. వీరి పెన్షనుకు కూడా ఎటువంటి గ్యారంటీ లేదు. ఉద్యోగులు, కార్మికులు కట్టే డబ్బులను విదేశీ, స్వదేశీ పెట్టుబడిదార్లు షేర్‌మార్కెట్‌కు తరలించేందుకు తెచ్చిన ఈ పథకాలను వ్యతిరేకించాలి. పి.ఎఫ్‌.ఆర్‌.డి.ఏ చట్టం తెచ్చి కార్మికుల కష్టార్జితాన్ని కాజేయాలన్న కుట్రను సాగనీయకూడదు.
ఎటువంటి మినహాయింపులు లేకుండా కార్మిక చట్టాలు అమలు చేయాలి. ఉల్లంఘనలకు కఠిన శిక్షలు విధించాలి.
యజమానులు తమ లాభాలను భారీగా పెంచుకునేందుకు కనీస వేతనాలు, పిఎఫ్‌, ఇఎస్‌ఐ, కాంట్రాక్టు కార్మికుల చట్టం బోనస్‌ చట్టాలను అమలు చేయకుండా తుంగలో తొక్కుతున్నారు. ఈ చట్టాలను అమలు చేయించాల్సిన కార్మిక శాఖ యజమానులతో కుమ్మక్కవుతోంది. కార్మిక చట్టాల అమలును పర్యవేక్షించే ఇనస్పెక్షన్‌కు ప్రభుత్వమే పాతరేసింది. సాధారణ పౌరుడు ఏ కొద్ది తప్పు చేసినా ప్రభుత్వం శిక్షలు వేస్తుంది. కార్మిక చట్టాలు ఉల్లంఘించే యజమానులను మాత్రం యథేచ్ఛగా వదిలి పెడుతుంది. కార్మిక చట్టాలను అమలు చేయమన్న పాపానికి కార్మికులను తప్పుడు కేసుల్లో ఇరికించి శిక్షిస్తుంది.
15 రోజుల్లోపు కార్మిక సంఘాలను తప్పనిసరిగా రిజిస్టరు చేయాలి. సంఘహక్కు, ఉమ్మడి బేరసారాల హక్కులకు సంబంధించిన ఐఎల్‌ఓ తీర్మానాలను ప్రభుత్వం అమోదించాలి.
మనదేశం పేరుకు ప్రపంచంలో ఒక పెద్ద ప్రజాస్వామిక దేశం. అయినా కార్మిక సంఘాలు రిజిస్టరు కావటం కనాకష్టం. కార్మిక సంఘాలను రిజిస్ట్రేషన్‌కు పెట్టుకుంటే కార్మిక శాఖ యజమానులకు ఉప్పందిస్తుంది. యజమానులు కార్మికులను వేధింపులకు గురిచేస్తారు. తప్పుడు ఆరోపణలతో ఉద్యోగాల నుండి తొలగిస్తారు. ఇంతకు ముందు ఎప్పుడూలేని విధంగా సరళీకరణ విధానాల అమలు కాలంలో సంఘం పెట్టుకోవటం , ఉమ్మడి బేరసాల వంటి ప్రాథమిక హక్కులు కూడా ఘోరంగా నిరాకరించబడుతున్నాయి. ఈ ముఖ్యమైన హక్కుల సంబంధించిన ఐఎల్‌ఓ తీర్మానాలు 87,98, లను కేంద్రయుపిఏ ప్రభుత్వం సాకులు చూపించి ఇంతవరకు అంగీకరించలేదు.
పి అజయ్ కుమార్‌
రాష్ట్ర కార్యదర్శి, సిఐటియు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి