13, జులై 2012, శుక్రవారం


 అవినీతి ఆందోళనకరం
   మానవాభివృద్ధిలోనూ అధమ స్థానం
 అరవై ఐదేళ్ల స్వాతంత్య్రంలో బిలియనీర్ల సంఖ్య పెరుగుతోందని సంబరపడితే అది ఆత్మవంచనే అవుతుంది.
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో అవినీతి తాండవిస్తోంది. అదే ప్రజల పాలిట శాపంగా మారింది. అక్షరాస్యతలో చెప్పుకోదగ్గ పురోగతి లేదు. మానవాభివృద్ధి సూచీలోనూ మన పొరుగు దేశాలకన్నా, కొన్ని ఆఫ్రికా దేశాల కన్నా వెనకబడి ఉన్నాం. సాధారణంగా ఆఫ్రికాను చీకటి ఖండంగా పిలుస్తారు. ఆ ఖండంలోని దేశాల్లో అవినీతి ఎక్కువ, అభివృద్ధి తక్కువ అని భావిస్తాం. నిజానికి అనేక ఆఫ్రికా దేశాలు చాలా విషయాల్లో మనకన్నా మెరుగ్గా ఉన్నాయి.        
  భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 60 శాతం మంది రోజుకు 35, అంతకంటే తక్కువ ఖర్చుతో జీవనం గడుపుతున్నారు. నగరాల్లోనూ 60 శాతం మందికి రోజుకు రూ. 66తోనే బతుకు వెళ్లదీస్తున్నారు. నేషనల్‌ శాంపిల్‌ సర్వే ఆర్గనైజేషన్‌ వెల్లడించిన వాస్తవాలివి. ఇది కూడా ఒక శాంపిల్‌ సర్వేనే అని సరిపెట్టుకునే చిన్న విషయం కాదు. పేదల బాగు కోసం ఎన్నో పథకాలు. వేల కోట్ల ఖర్చు. అయినా ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది? ఇంకా ఇంత పేదరికం ఎందుకు తాండవిస్తోంది?
    ఆధునిక యుగంలో ఏ దేశమైనా ముందుకు వెళ్లడానికి అక్షరాస్యత చాలా ముఖ్యం. ఈ విషయంలో ప్రపంచంలో మనం తలెత్తుకు నిలబడే పరిస్థితిలో లేము. భారత్‌లో అక్షరాస్యత 75 శాతం. పొరుగుదేశం శ్రీలంకలో ఇది 94 శాతం. ఆఫ్రికా దేశం కెన్యాలో 84 శాతం. ఇండోనేషియా 92 శాతం, బ్రెజిల్‌ 90 శాతం అక్షరాసత్య సాధించాయి.
     దేశ అభివృద్ధికి ముఖ్యమైన కొలమానాల్లో మానవాభివృద్ధి సూచీ (హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌) ఒకటి. ఇందులోనూ ఏమున్నది గర్వకారణం అన్నట్టే ఉంది మన పరిస్థితి. ఈ విషయంలో భారత్‌ ర్యాంకు ఎక్కడో చిట్ట చివరన 136. ఆఫ్రికా దేశం నమీబియా కూడా మనకన్నా మెరుగ్గా 124వ ర్యాంకు సాధించింది. శ్రీలంక ర్యాంకు 97. మరి అభివృద్ధి కోసం చేస్తున్న వేలూ లక్షల కోట్లు ఏమైనట్టు అంటే అదే అంతు పట్టదు.
   జీవన ప్రమాణాల విషయంలోనూ మనం దిగదుడుపే. భారత్‌లో లైఫ్‌ ఎక్స్‌పెక్టెన్సీ 64.7 ఏళ్లు. 139వ ర్యాంకు. ప్రపంచ సగటు కన్నా ఇది తక్కువ. జపాన్‌ ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది. చివరికి పాకిస్తాన్‌ కూడా 65.6తో మన కన్నా మెరుగ్గా 137వ ర్యాంకు పొందింది. శ్రీలంక ర్యాంకు 91.
   ఇక, భారత్‌ 'గొప్పగా' చెప్పుకోగలిగే అంశం అవినీతి. ఈ విషయంలో మన రికార్డు పదిలం. కరప్షన్‌ పర్సెప్షన్‌ ఇండెక్స్‌ ప్రకారం అవినీతిలో భారత్‌ది 94 స్థానం. చీకటి ఖండం ఆఫ్రికాలోని నమీబియా (57వ ర్యాంకు), జాంబియా (91వ ర్యాంకు)ల్లోనూ మన కన్నా అవినీతి తక్కువ. మరో ఆఫ్రికా దేశం రువాండా అయితే 49వ ర్యాంకు పొందింది. అంటే మనతో పోలిస్తే అక్కడ అవినీతి చాలా తక్కువ. సూచీలో శ్రీలంక 86వ ర్యాంకుతో ఈ విషయంలోనూ మన కంటే మెరుగ్గా ఉంది.          
ే     వేళ్లమీద లెక్కించే కుబేరుల సంఖ్య పెరుగుతోందని సంతోషించి, కుచేలుర దుస్థితికి బాధ్యులు ఎవరనే విషయాన్ని విస్మరించినంత కాలం దేశం ఇలాగే ఉంటుంది. రాజకీయ నాయకులు నిరంతరం ప్రజా సేవ చేస్తుంటారు. ప్రభుత్వాలు ప్రతి క్షణం పేదల బాగు కోసమే పరితపిస్తుంటాయి. అయినా పేదలు పేదలుగానే ఉంటారు. ధనికులకు, పేదలకూ మధ్య, పల్లెకూ పట్నానికి మధ్య అంతరం పెరుగుతూనే ఉంది. తినడానికి తిండిలేని ప్రజలు తిరగబడ లేరులే అని పాలకులు భావిస్తే అది పొరపాటే. ఆకలి మంటతో విలవిల్లాడే ప్రజలు ప్రశ్నించే రోజు వస్తే, ఏ పాలకులూ తట్టుకోలేరు. అలాంటి పరిస్థితి రాకముందే పాలకులు చిత్తశుద్ధితో పనిచేసే శుభఘడియలు మొదలు కావాలని ఆకాంక్షిద్దాం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి