31, జులై 2012, మంగళవారం

న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచంలో ఓ అద్భుతం జరగబోతోంది. ప్రపంచ జనాభా 700కోట్లను దాటనుంది. ఈ 700కోట్లు పూర్తిచేసే శిశువు ప్రపంచంలోని ఏ దేశంలో జన్మిస్తుందో... అది ఆడో.. మగో తెలియకపోయినా కచ్చితంగా ఈ శతాబ్దంలో జరిగే ప్రపంచ అద్భుతాల్లో ఇదొకటిగా నిలిచిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా జనాభా విస్ఫోటం వేగం తగ్గలేదు. గత రెండు దశాబ్దాలుగా జనాభా నియంత్రణ పథకాల్ని ప్రపంచ దేశాలు ఎంత సమర్ధమంతంగా అమలు చేస్తున్నా ఈ ఫలితాలింకా అందుబాటులోకి రాలేదు. కొన్ని వర్ధమాన దేశాలతోపాటు పేద దేశాలు కూడా జనాభా నియంత్రణలో వెనుకబడ్డాయి. అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న దేశాలు మాత్రమే జనాభా నియంత్రణలో కాస్త మెరుగైన ఫలితాలు సాధించాయి.
యుఎస్‌ సెన్సెస్‌ బ్యూరో ఇంటర్‌నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ సెంటర్‌ రూపొందించిన గణాంకాల మేరకు ప్రపంచంలో ప్రతివెయ్యిమంది జనాభాకు జనన రేటు 19గా ఉంటే మరణాల రేటు 8గా ఉంది. ప్రపంచంలో ప్రతినిమిషానికి 250మంది పుడుతుంటే 105 మంది మరణిస్తున్నారు. ప్రతిగంటకు 15వేల మంది పుడుతుంటే 6,316 మంది చనిపోతున్నారు. ప్రతిరోజు 3.60 లక్షల జననాలు, 1,51,600 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతిఏటా 13.13కోట్లమంది పుడుతున్నారు. 5.53కోట్లమంది మరణిస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచ జనాభా సగటు వయసు 67ఏళ్ళుగా లెక్కించారు. ప్రపంచ జనాభాలో 26శాతం 180కోట్లమంది 15ఏళ్ళ లోపు పిల్లలున్నారు. 66శాతం 440కోట్లమంది 15నుంచి 64ఏళ్ళ వయస్కులున్నారు. 8శాతం మంది 51.60కోట్లమంది 65ఏళ్ళకు పైబడ్డవారున్నారు.
2011 అక్టోబర్‌ మూడోవారంలోగా 700కోట్ల సంఖ్యను ప్రపంచ జనాభా దాటుతుందని ముందుగానే అంచనావేశారు. 1950నుంచి జనాభా వృద్ధి జోరు పెరిగింది. ఏటా 1.8శాతంగా ఇది నమోదైంది. 1970వరకు కూడా ఈ వేగం సాగింది. 1963లో అయితే ఏకంగా 2.2శాతానికి పెరిగింది. అనంతరం తీసుకున్న చర్యలకు 2009నాటికిది 1.1శాతానికి పడిపోయింది. 1990వరకు ఏటా 17.30కోట్ల జననాలుంటే దాన్ని 14కోట్లకు తగ్గించగలిగారు. అందుబాటులో ఉన్న వివరాల మేరకు ప్రపంచంలో క్రీస్తుపూర్వం 70వేల సంవత్సరంలో ప్రపంచ జనాభా 15వేలుండేది. క్రీస్తుపూర్వం 10వేలనాటికి 10లక్షలకు చేరింది. 9వేలు నాటికి 30లక్షలు, 8వేలు నాటికి 50లక్షలు, 7వేలునాటికి 70లక్షలు దాటి క్రీస్తుపూర్వం 6వేల నాటికి జనాభా కోటి మైలురాయిని చేరుకుంది. అక్కడి నుంచి వేగంగా వృద్ధి చెందింది. క్రీస్తుపూర్వం 5వేలునాటికి 1.50కోట్లు, 4వేలు నాటికి 2కోట్లు, 3వేల నాటికి రెండున్నరకోట్లు, 2వేలనాటికి మూడున్నరకోట్లు, వెయ్యి నాటికి 5కోట్లు, 500నాటికి 10కోట్లకు ప్రపంచ జనాభా చేరుకుంది. క్రీస్తుశకం ప్రారంభమయ్యేసరికి ప్రపంచ జనాభా 20కోట్లుగా నమోదైంది. క్రీస్తుశకం వెయ్యో సంవత్సరానికి 31కోట్లకు చేరుకుంది. 1750నాటికి ఖండాలవారీగా జనగణన మొదలైంది. ఆ ఏడాది ప్రపంచ జనాభా 79.10కోట్లుగా నమోదైంది. ఆసియాలో 50.2కోట్లు, యూరోప్‌లో 16.3కోట్లు, ఆఫ్రికాలో 10.6కోట్లు, లాటిన్‌ అమెరికాలో 1.60కోట్లు, ఉత్తరఅమెరికాలో 20లక్షలు, ఆస్ట్రేలియాతో కలిపి ఒషియానియాలో 20లక్షలు జనాభా ఉన్నట్లు గుర్తించారు.
కాగా, 1804లో ప్రపంచ జనాభా మొట్టమొదటిసారిగా వందకోట్లను దాటింది. అప్పటినుంచి 123ఏళ్ళకు అంటే 1927కు 200కోట్లకు చేరిన ప్రపంచ జనాభా 33ఏళ్ళకు అంటే 1960కు 300కోట్లను నమోదు చేసింది. అక్కడినుంచి 14ఏళ్ళకే అంటే 1974కు 400కోట్లు, మరో 13ఏళ్ళకు అంటే 1987లో 500కోట్లకు చేరుకుంది. అక్కడి నుంచి 12ఏళ్ళకే 1999లో 600కోట్లను దాటేసింది. ఆ తర్వాతే మరో 12ఏళ్ళకే 700కోట్ల మైలురాయిని దాటేస్తోంది. కాగా
ఇప్పటికే తీసుకున్న జనాభా నియంత్రణ చర్యలు ఫలితాలిస్తుండడంతో మరో వందకోట్ల జనాభా పెరిగేందుకు 23ఏళ్ళు పడుతుందని ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా అంచనాలు వేస్తున్నారు. 1950..2010ల మధ్య జనాభా వృద్ధి రేటు ఖండాల వారీగా చూస్తే ఆఫ్రికా అగ్రగామిగా ఉంది. ఆ ఖండంలో 26.1శాతం వృద్ధి రేటు నమోదైంది. కాగా ఆసియాలో 12.7శాతం, యూరోప్‌లో 0.8శాతం, ఉత్తర అమెరికాలో 10.4శాతం, దక్షిణఅమెరికాలో 13.2శాతం, ఓషియానియాలో 15శాతం వృద్ధి నమోదైంది. ఇప్పటికీ జనాభాలో చైనాదే అగ్రస్థానం. ఆ తర్వాత స్థానాన్ని భారత్‌ ఆక్రమిస్తోంది. మొత్తం ప్రపంచంలో 19.3శాతం జనాభా చైనాలోనే ఉంది. కాగా భారత్‌లో 17శాతం ఉంటే యుఎస్‌లో 4.48శాతం, ఇండోనేషియాలో 3.36శాతం, బ్రెజిల్‌లో 2.80శాతం, పాకిస్తాన్‌లో 2.55శాతం, బంగ్లాదేశ్‌లో 2.28శాతం, నైజీరియాలో 2.23శాతం, రష్యాలో 2.037శాతం, జపాన్‌లో 1.83శాతం జనాభా జీవిస్తున్నారు. చైనీస్‌ అఫిషియల్‌ పాపులేషన్‌ క్లాక్‌ ప్రకారం 2011అక్టోబర్‌ 17వ తేదీన చైనా జనాభా 134.69కోట్లను దాటింది. యుఎస్‌ అఫిషియల్‌ పాపులేషన్‌ క్లాక్‌ ప్రకారం అదే రోజుకు ఆదేశ జనాభా 31,24,38,217గా నమోదైంది. సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ వెల్లడించిన వివరాల మేరకు ఈ ఏడాది మార్చి 31నాటికి భారత జనాభా 120,37, 10,000సంఖ్యను దాటింది. ఇండోనేషియా జనాభా 23,84,15,631అంటూ సులోక్‌నుసంతార ఇండొనేషియా సెన్సెస్‌ రిపోర్టు ప్రకటించింది. బ్రెజిల్‌ జనాభాను 19,53,94,000గా ధృవీకరించారు. పాక్‌ జనాభా 17,75,40,000లుగా లెక్కించారు. బంగ్లాదేశ్‌ జనాభా 15,85,70,535అని, నైజీరియా జనాభా 15,52,15,000అంటూ సిఐఎ వరల్డ్‌ ఫాక్ట్‌బుక్‌ ఎస్టిమేట్స్‌ 2011సంచికలో ప్రకటించారు. రష్యా జనాభా 14,19,27,297గా ఫెడరల్‌ స్టేట్‌ స్టాటస్టిక్స్‌ సర్వీసెస్‌ ఆఫ్‌ రష్యా పేర్కొంటే జపాన్‌ జనాభాను 12,73,87, 000అంటూ అఫిషియల్‌ జపాన్‌ స్టాటస్టిక్స్‌ బ్యూరో వెల్లడించింది. మొత్తం ప్రపంచ జనాభాలో 58.70శాతం ఈ పదిదేశాల్లో నివసిస్తున్నారు. సుమారుగా 403కోట్ల మంది ఇక్కడే ఉంటున్నారు.
ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత గల దేశంగా సింగపూర్‌ రూపుదిద్దుకుంది. ఇక్కడ ప్రతి చదరపు కిలోమీటర్‌కు 7,331మంది జీవిస్తున్నారు. 707చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న సింగపూర్‌లో 51,83,700 మంది జనాభా ఉన్నారు. ఆ తర్వాత స్థానాన్ని బంగ్లాదేశ్‌ ఆక్రమించింది. 1,47,570చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని బంగ్లాదేశ్‌లో 15.85కోట్లమంది ఉన్నారు. ఇక్కడ జనసాంద్రత చదరపు కిలోమీటర్‌కు 1069గా ఉంది. ఆ తర్వాత 702 జనసాంద్రతతో పాలస్తీనియన్‌ టెరిటోరియస్‌, 631జనసాంద్రతతో మారిషస్‌, 487తో సౌత్‌కొరియా, 404తో లెబనాన్‌, 402తో నెదర్లాండ్స్‌, 380తో రువాండ, 371తో ఇజ్రాయిల్‌ అత్యధిక జనసాంద్రతగల దేశాలయ్యాయి. కాగా బంగ్లాదేశ్‌, ఫిలిప్పీన్స్‌లను అతివేగంగా జనాభా పెంచుతున్న దేశాలుగా ప్రకటించారు. ఇండియా, వియాత్నం, యునైటెట్‌ కింగడమ్‌, శ్రీలంకలను జనాభా పెరుగుతున్న దేశాలుగానూ, సౌత్‌కొరియా, చైనా, నెదర్లాండ్స్‌ను జనాభా పెరుగుదలను అరికట్టగలిగిన దేశాలుగా, జపాన్‌ను జనాభాను తగ్గిస్తున్న దేశంగా ప్రకటించారు. కాగా 32,87,240చదరపు కిలోమీటర్ల వైశాల్యం, 120కోట్ల జనాభాగల భారత్‌లో కూడా జనసాంద్రత 366గా ఉంది. కాగా ఐక్యరాజ్యసమితి 2010 డిసెంబర్‌లో ప్రపంచ జనాభా పెరుగుదలపై అంచనాలు రూపొందించింది. దీనిప్రకారం 2010చివరికి 689కోట్లున్న ప్రపంచ జనాభా 2020నాటికి 765కోట్లు, 2030నాటికి 800కోట్లకు 2050నాటికి 915కోట్లకు చేరుతుందని అంచనాలేశారు. కాగా భవిష్యత్‌లో ఆసియా దేశాలు జనాభాను తగ్గించుకుంటాయని కూడా ఈ అంచనాల్లో పేర్కొన్నారు. అదే సమయంలో ఆఫ్రికా దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతుదంని కూడా స్పష్టం చేశారు. 2000వ సంవత్సరం నాటికి ప్రపంచ జనాభాలో ఆసియా భాగస్వామ్యం 60.50ఉంటే 2010నాటికది 60.30కు తగ్గింది. 2020నాటికి 59.90శాతానికి, 2040నాటికి 58.2శాతానికి, 2050నాటికి 57.2శాతానికి తగ్గిపోతుందన్నది ఈ అంచనా. కాగా 2000నాటికి ఆఫ్రికా భాగస్వామ్యం 13.40శాతం ఉంటే 2010కే ఇది 15శాతానికి పెరిగింది. 2010నాటికి 16.6, 2030 18.3, 2040నాటికి 20.1, 2050నాటికి 21.80శాతానికి పెరుగుతుందన్నది అంచనా. కాగా ఉత్తర అమెరికా 2000లో 5.2శాతం భాగస్వామ్యంతో ఉంటే ఇది 2050నాటికి 4.9శాతానికి పడిపోనుంది. యూరోప్‌ జనాభా 2000లో ప్రపంచ జనాభాలో 11.90శాతముంటే 2050నాటికి 7.60శాతానికి తగ్గిపోతుంది. ప్రపంచంలో నాగరికతతో పాటే ఆధునిక వైద్యవిధానం అందుబాటులోకొచ్చింది. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని మానవుడే సృష్టించుకున్నాడు. దీర్ఘకాల జీవితాన్నిచ్చే ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చుకున్నాడు. దీంతో మరణాల రేటు తగ్గింది. మనిషి ఆయుష్షు పెరిగింది. అంతమాత్రాన మానవుడు సంతోషించలేదు. తన బ్రతుకు కోసం ప్రకృతి వినాశానికి పూనుకున్నాడు. ఇప్పటికే వాతావరణ కాలుష్యం పెరిగింది. ఊహించని, అదుపు చేయలేని అనారోగ్యాలు అలముకుంటున్నాయి. 1350లో వచ్చిన ప్లేగు ప్రపంచ దేశాల జనాభాను తుడిచిపెట్టేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఆ తర్వాత తిరిగి మానవ మనుగడ రూపుదిద్దుకుంది. ఇప్పటికే భూమికి మానవుడు భారంగా తయారయ్యాడు. జనసంఖ్యపరంగానే కాక భూమికీ, ప్రకృతికీ చేటును కొనితెస్తున్నాడు. ఈ పరిస్థితి మారకపోతే ప్రకృతి సృష్టించే విలయానికి బలికాక తప్పదు.

యుఎస్‌ సెన్సెస్‌ బ్యూరో ఇంటర్‌నేషనల్‌ ప్రోగ్రామ్స్‌ సెంటర్‌ రూపొందించిన గణాంకాల మేరకు ప్రపంచంలో ప్రతివెయ్యిమంది జనాభాకు జనన రేటు 19గా ఉంటే మరణాల రేటు 8గా ఉంది. ప్రపంచంలో ప్రతినిమిషానికి 250మంది పుడుతుంటే 105 మంది మరణిస్తున్నారు. ప్రతిగంటకు 15వేల మంది పుడుతుంటే 6,316 మంది చనిపోతున్నారు. ప్రతిరోజు 3.60 లక్షల జననాలు, 1,51,600 మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతిఏటా 13.13కోట్లమంది పుడుతున్నారు. 5.53కోట్లమంది మరణిస్తున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచ జనాభా సగటు వయసు 67ఏళ్ళుగా లెక్కించారు. ప్రపంచ జనాభాలో 26శాతం 180కోట్లమంది 15ఏళ్ళ లోపు పిల్లలున్నారు. 66శాతం 440కోట్లమంది 15నుంచి 64ఏళ్ళ వయస్కులున్నారు. 8శాతం మంది 51.60కోట్లమంది 65ఏళ్ళకు పైబడ్డవారున్నారు.
ఇప్పటికే భూమికి మానవుడు భారంగా తయారయ్యాడు. జనసంఖ్యపరంగానే కాక భూమికీ, ప్రకృతికీ చేటును కొనితెస్తున్నాడు. ఈ పరిస్థితి మారకపోతే ప్రకృతి సృష్టించే విలయానికి బలికాక తప్పదు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి