31, జులై 2012, మంగళవారం


దరిద్రాంధ్రప్రదేశ్‌
March 31, 2012
raIMG_2420amహైదరాబాద్‌, మేజర్‌ న్యూస్‌: దునియా ముఠ్ఠీమే... ఇదొక సెలఫోన్‌ సంస్థ ప్రచార వ్యాఖ్యలు... ఒక కోణంలో నుంచి చూస్తే ప్రపంచం అరచేతిలోనే కనిపిస్తుంది. కానీ వాస్తవంగా సగటు మనిషి జీవితం నడిరోడ్డుమీద నిలబడే ఉంది. ఇది సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా ఏపీ 2011 అధికా రికంగా ప్రకటించిన అక్షర సత్యాలివి... శుక్రవారం సెన్సెస్‌ ఆఫ్‌ ఇండియా ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర సంచాలకులు వై.వి.అనురాధ 2011 ఇళ్లు, ఇళ్లలో మౌలిక వసతులకు సంబంధించిన గణాంకాలను విడుదల చేశారు. డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్స్‌ ఆధ్వర్యంలో సుమారు 1.8 లక్షల మంది ఎన్యూమరేటర్లు 45 రోజులపాటు రాష్ట్రంలోని 23 జిల్లాల్లో శ్రమించి ఈ గణాంకాలను సేకరించారు.

ఇందులో పక్కా ఇళ్లు, ఇంటిపై కప్పు, ఇంటి గోడలు, ఇంటి ఫ్లోరింగ్‌ మొదలుకుని ఇళ్లలో వంటగది, బెడ్‌ రూం, బాత్‌ రూం, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతుల వివరాలను సైతం సేకరించారు. అంతేగాకుండా ఇళ్లలో ఎంతమంది సభ్యులు నివసిస్తున్నారు. వివాహమైన జంటలు కాపురం ఉన్న ఇళ్ల సంఖ్య ఎంత?, విద్యుదీకరణ జరిగిన ఇళ్లు ఎన్ని, ఇంకా కిరోసిన్‌ దీపాల మీద ఆధారపడి బతుకులీడుస్తున్న వారెందరు?, ఆముదం ఇతర నూనెలతో దీపాలను వెలిగించుకుని జీవనం గడుపుతున్నవారెందరు?, అన్న వివరాలను కూడా సేకరించారు. అంతేగాక శుద్ధి చేసిన రక్షిత మంచినీరు ఎన్ని ఇళ్లకు అందుతోంది అన్నది మొదలుకుని టీవీలు ఎందరు ఇళ్లలో ఉన్నాయి?, సెల్‌ ఫోన్లు ఉపయోగించుకుంటున్న ఇళ్ల సంఖ్య ఎంత?, నేటికీ వ్యక్తిగత మరుగుదొడ్ల సదుపాయం లేకుండా ఆరుబయటే కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లే కుటుంబాల సంఖ్య ఎంత? అన్న వివరాలు కూడా సేకరించారు.

ఈ సెన్సెస్‌ బయటపెట్టిన గణాంకాలను పరిశీలిస్తే స్వాతంత్య్రం వచ్చి ఆరున్నర దశాబ్ధాలు గడిచిపోతున్నా ఇంకా ఆంధ్రప్రదేశ్‌ దరిద్రాంధ్రప్రదేశ్‌గానే మిగిలి ఉందన్న కర్ణ కఠోర సత్యం బయటకొచ్చింది. నాయకులు తమ రాజకీయ ప్రయో జనాల కోసం తిమ్మిని బమ్మిని చేస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్‌ అని ఒకరంటే, హరితాంధ్రప్రదేశ్‌ అని మరొకరు పోటీలు పడి ప్రజలను మాటల మత్తులో ముంచెత్తి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. సెన్సెస్‌ సమచారం ప్రకారం రాష్ట్రంలో 2,55,94,996 ఇళ్లు ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాలలో 1,71,74, 077 ఇళ్లు ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 84,20,919 ఇళ్లు ఉన్నాయి.

అయితే ఇందులో వివిధ కారణాలరీత్యా నిర్మాణ దశలో నిలిచిపోయినవి కొన్ని, నిర్మాణం పూర్తయి ఆక్యుపేషన్‌లో లేనివి కొన్ని, నివాస యోగ్యానికి వీలులేని స్థితిలో ఉన్న ఇళ్లు మరికొన్ని మొత్తం కలిపి 18,85,565 ఇళ్లు ఉండగా అందులో గ్రామీణ ప్రాంతాలలో 12,71,199 ఇళ్లుం డగా, పట్టణ ప్రాంతాలలో 6,14, 366 ఇళ్లు ఉన్నట్లు సెన్సెస్‌ లెక్కలు బయటపెట్టాయి. మొత్తం పైన రాష్ట్రంలో 2,37,09,431 ఇళ్లను మాత్రమే ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. అందులో కేవలం నివాసయోగ్యానికి ఉపయోగించు కుంటున్నవి ఇళ్ల శాతం 86 శాతం కాగా, నివాసంతోపాటు ఇతర అవసరాలకు ఉపయోగించు కుంటున్న వాటి సంఖ్య 1.8 శాతం ఉంది. షాపులు, కార్యాలయాల కోసం ఉపయోగించు కుంటున్న వాటి సంఖ్య 3.3 శాతం ఉంది.

పాఠశాలలు, కళాశాల లకోసం ఉపయోగించుకుంటున్న వాటి సంఖ్య 0.6 శాతం ఉంది. హోటళ్లు, లాడ్జిలు, గెస్ట్‌ హౌస్‌ల కింద 0.3 శాతం ఉపయోగించుకుంటున్నారు. ఆసుపత్రులు, డిస్పెన్సరీల కింద 0.2 శాతం భవనాలు, ఫ్యాక్టరీలు, వర్క్‌షాపులు తదితరాల కింద 0.7 శాతం వర్క్‌షిప్‌ కింద 0.8 శాతం, నివాసేతర ఉపయోగం కింద 6.0 శాతం ఇళ్లు ఉండగా సెన్సెస్‌ యంత్రాంగం గణాంక సేకరణకు వెళ్లినప్పుడు తాళం వేసి ఉన్న ఇళ్ల సంఖ్య 73,499 ఉంటే 0.3 శాతం ఉన్నట్లు గణాంకాలు బయటపెట్టాయి.

మంచి కండీషన్‌లో ఉన్న ఇళ్ల సంఖ్య 69.8 శాతం కాగా, శిథిలావస్థకు చేరిన భవనాల సంఖ్య 3.5 శాతం ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఉన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలిస్తే 15.8 శాతం ఇళ్లు గడ్డి, వెదురు, కలప, తదితర వాటితో నిర్మించినవే ఉన్నాయి. ప్లాస్టిక్‌ లేదా పాలిథిన్‌తో నిర్మితమైన ఇళ్ల సంఖ్య 0.3 శాతం ఉంది. ఇటుకతో నిర్మించిన ఇళ్ల సంఖ్య 6.1 శాతం కాగా, పెంకులతో కప్పబడిన ఇళ్ల సంఖ్య 10 శాతం మేరకు ఉంది. ఆస్‌బెస్టాస్‌ రేకులతో నిర్మించిన ఇళ్ల సంఖ్య 12.4 శాతం కాగా కాంక్రీట్‌తో నిర్మించిన ఇళ్ల సంఖ్య 48.9 శాతం ఉంది.

*రాష్ట్రంలో ప్రత్యేక గది అంటూ లేని ఇళ్ల సంఖ్య 2.9 శాతం. కాగా అందులో మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే 4.2 శాతం ఇలాంటి ఇళ్లు ఉన్నాయి. అతి తక్కువగా నల్గొండ జిల్లాలో 1.7 శాతం ఉన్నాయి. రెండు గదులున్న ఇళ్లను తీసుకుంటే రాష్ట్రం మొత్తమ్మీద 34.8 శాతం ఉండగా అందులో అత్యధికంగా నల్గొండ జిల్లాలోనే 42.01 శాతం ఆ తర్వాత 40 శాతంతో వరంగల్‌ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. అతితక్కువగా పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరులో 24.5 శాతం ఉన్నాయి.
*రాష్ట్రంలో ఒకే వ్యక్తి నివసిస్తున్న ఇళ్ల సంఖ్య 5 శాతం ఉండగా, అందులో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లా లోనే 6.8 శాతం ఆక్రమించింది. ఇద్దరు వ్యక్తులు మాత్ర మే నివసిస్తున్న ఇళ్ల సంఖ్యలో పశ్చిమ గోదావరి జిల్లా 18 శాతంతో ప్రథమ స్థానంలో ఉండగా, 17.8 శాతంతో కృష్ణా జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది.

ఈ విధమైన గణనలో అతి తక్కువగా ఉన్న జిల్లాల్లో మెదక్‌, కర్నూలు జిల్లాలు 9.9 శాతంతో ఉన్నాయి. 9 మంది అంతకంటే ఎక్కువ ఒకే చోట నివాసముంటున్న ఇళ్ల సంఖ్యలో 4.8 శాతంతో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉండగా, 3.4 శాతం తో మెదక్‌ జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. అతితక్కువగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు 0.5 శాతంతో చివరి స్థానంలో ఉన్నాయి.
*పెళ్లైన జంటలు జీవిస్తున్న ఇళ్ల సంఖ్య రాష్ర్టంలో పరిశీలిస్తే ఒక పెళ్లితో జీవిస్తున్న వారు ఉంటున్న ఇళ్ల సంఖ్య 75.8 శాతం కాగా, రెండు పెళ్లిళ్లతో జీవిస్తున్న ఇళ్ల సంఖ్య 9.5 శాతంగా ఉంది. మూడేసి పెళ్లిల్లు చేసేకున్న జంటల సంఖ్య కూడా 1.1 శాతం ఉంది. అయితే ఇందు లో అసలు వివాహం కాకుండానే ఒకే ఇంట్లో నివసిస్తున్న జంటల సంఖ్య 13.4 శాతం ఉంది. ఇందులో అత్యధి కంగా వివాహం కాకుండా జీవిస్తున్న జంటలు నివసిస్తున్న ఇళ్లున్న జిల్లాల్లో 16.2 శాతంతో తూర్పుగోదావరి ప్రథమ స్థానంలో ఉండగా 9.9 శాతంతో రంగారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉన్నట్లు సెన్సస్‌లో తేలింది.

*రాష్ట్రంలో 69.9 శాతం ఇళ్లకు మాత్రమే నల్లా నీరు లభిస్తోంది. అందులో కూడా 49 శాతం ఇళ్లకే శుద్ధి చేసిన నీరు లభిస్తోంది. 6.4 శాతం ఇళ్లు ఇంకా బావులపైనే ఆధారపడి ఉన్నాయి. నల్లా నీటిని ఉపయోగించుకుంటున్న జిల్లాల్లో 97.7 శాతంతో హైదరాబాద్‌, 87 శాతంతో రంగారెడ్డి జిల్లాలు ప్రథమ వరుసలో ఉండగా, 26 శాతంతో శ్రీకాకుళం జిల్లా చివరి స్థానంలో ఉంది.
*రాష్ట్రం మొత్తమ్మీద 92.2 శాతం ఇళ్లు విద్యుత్‌ను ఉపయోగించుకుంటుండగా అందులో హైదరాబాద్‌ 98.7 శాతం, రంగారెడ్డి 95.9 శాతంతో అగ్ర భాగాన, మహబూ బ్‌నగర్‌ జిల్లా 86.7 శాతంతో చివరి స్థానంలో ఉంది.
*కిరోసిన్‌ వెలుగును నమ్ముకున్న జిల్లాల్లో 11.5 శాతంతో అదిలాబాద్‌ ప్రథమ స్థానంలో ఉంది.
*రాష్ట్రంలో 48.48 శాతం కుటుంబాలు ఇంకా కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఆరుబయటి పొలాల బాటనేపడుతున్నాయి. 2.5 శాతం మంది మాత్రమే పబ్లిక్‌ టాయిలెట్‌లను ఉపయోగించుకుంటున్నారు. ఆరుబయట కాలకృత్యాలు తీర్చుకుంటున్న వారికి సంబంధించి 77.4 శాతంతో శ్రీకాకుళం, 76.6 శాతంతో విజయనగరం జిల్లాలు ముందువరుసలో ఉన్నాయి. రాష్ట్రంలో సొంత ఇళ్లు ఉన్న వారి శాతం 78.5 కాగా అందులో 91.6 శాతంతో మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రథమ స్థానంలో ఉంది.

*రాష్ట్రంలో 58.8 శాతం ఇళ్లలో టీవీలు ఉండగా అందులో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలే 84.7, 75.2 శాతంతో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా 41.5 శాతంతో చివరి స్థానంలో ఉంది. సెల్‌ఫోన్‌లు ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య రాష్ట్రం మొత్తమ్మీద 54.9 శాతం ఉండగా అందులో 71.3 శాతంతో రంగారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. 39.6 శాతంతో విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి