31, జులై 2012, మంగళవారం

వాషింగ్టన్‌: అత్యంత సంపన్న దేశంగా గుర్తింపు పొందిన అమెరికాలో ప్రతి ఆరుగురులో ఒకరు పేదవారేనని వెల్లడైంది. అమెరికా ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయిందనడానికి ఇది తాజా ఉదాహరణ. 2009లో దారిద్రరేఖకు దిగువవున్న వారి సంఖ్య 14.3 శాతం వుండగా, 2010లో ఇది 15.1 శాతంగా నమోదైందని సెన్సెస్‌ బ్యూరో వెల్లడించింది. 2009లో 43.6 మిలియన్ల మంది ఈ సంఖ్య 2010లో 46.2 మిలియన్లకు పెరిగిందని, వరుసగా నాలుగవ ఏట దేశంలో పేదవారి సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోందని 'ఆదాయం, దారిద్య్రం, ఆరోగ్యం, బీమా సౌకర్యం' అనే అంశాలపై సెన్సెస్‌ బ్యూరో అధ్యయనంచేసి రూపొందించిన నివేదికలో పేర్కొన్నారు. నలుగురు సభ్యులున్న కుటుంబం వార్షిక ఆదాయం 22,314 డాలర్లు(సుమారు రూ.10 లక్షలు), లేదా ఒక వ్యక్తి వార్షిక ఆదాయం11,319(సుమారు రూ.5లక్షలు) దాటనివారిని దారిద్య్ర రేఖకు దిగువన వున్న వారిగా అమెరికా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఆరోగ్య బీమా లేనివారి సంఖ్య 49 మిలియన్ల నుంచి 49.9 మిలియన్లకు పెరిగిందని ఈ నివేదిక స్పష్టం చేస్తున్నది. అమెరికా గత కొద్ది రోజులుగా ఆర్థికమాద్యం ఎదుర్కొంటుండగా, 2007 నుంచి పౌరుల ఆదాయం గణనీయంగా తగ్గిపోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నది. కాగా, 18 సంవత్సరాల వయస్సుకన్నా తక్కువవున్న పిల్లలలో దారిద్య్రం పెరుగుదల శాతం అధికంగా వుండటం గమనార్హం. గత కొద్ది సంవత్సరాలుగా అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థికమాద్యం కారణంగానే
దేశంలో దారిద్య్రం పెరిగిపోతున్నదని నివేదిక స్పష్టం చేసింది. 1961, 1975, 1981, 1990 సంవత్సరాలలో దేశంలో ఆర్థికమాద్యం ఏర్పడినప్పటికీ కేవలం ఒక్క సంవత్సరంలోనే ఆర్థిక వ్యవస్థ పుంజుకోగా, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా నాలుగు సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ పతనం కావడం నిపుణులను కలవరపరుస్తున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి